housing loan: హౌసింగ్‌ లోన్‌, పోటీ పడి మరీ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు

2 Oct, 2021 08:53 IST|Sakshi

గృహ రుణ వడ్డీ కోతల రేసులో హెచ్‌ఎస్‌బీసీ, యస్‌ బ్యాంక్‌  

ముంబై: పండుగల సీజన్‌ నేపథ్యంలో నెలకొనే గృహ రుణ డిమాండ్‌లో మెజారిటీ వాటా పొందడానికి పోటీ పడుతున్న బ్యాంకుల్లో తాజాగా ప్రైవేటు రంగంలోని హెచ్‌ఎస్‌బీసీ, యస్‌ బ్యాంక్‌ లు చేరాయి.

కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 
వడ్డీ భారం ఎక్కువై ఇతర బ్యాంకుల నుంచి గృహ రుణం మార్చుకునే వారికి (బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌) సంబంధించి వడ్డీరేటును 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.45 శాతంగా అమలు చేస్తున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ ప్రకటించింది. బ్యాంకింగ్‌ పరిశ్రమలోనే ఇది అతి తక్కువ గృహ రుణ వడ్డీరేటు.  

► ఇక కొత్త రుణాల విషయంలో బ్యాంక్‌ 6.70 శాతం వడ్డీ ఆఫర్‌ ఇస్తోంది. ఇది ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలకు సమానం.
 
► డిసెంబర్‌ 31 వరకూ అమలవుతుందని, తాజా రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు కూడా ఉండబోదని హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది.
  
 యస్‌ బ్యాంక్‌ కూడా 6.70 శాతానికి గృహ రుణాన్ని ఆఫర్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.  వేతనం పొందే మహిళలకు సంబంధించి ఈ ఆఫర్‌ 6.65 శాతంగా ఉంటుంది.  

ఇప్పటికే పలు బ్యాంకులు ఇలా... 
పండుగ సీజన్‌ డిమాండ్‌లో భారీ వాటా లక్ష్యంగా ఇప్పటికే ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ) గృహ రుణ రేట్లను ఇటీవలే భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే.

అత్యధిక క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణ లభ్యత ఉంటుందని ఎస్‌బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్‌ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. ఇక మరో ప్రభుత్వ రంగ బీఓబీ కూడా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని గృహ రుణ రేటు 6.75 శాతం వద్ద ప్రారంభమవుతుందని ప్రకటించింది.

ప్రభుత్వ రంగ పీఎన్‌బీ కూడా రూ.50 లక్షలు దాటిన గృహ రుణంపై అరశాతం (50 బేసిస్‌ పాయింట్లు) వడ్డీరేటు తగ్గించింది. దీనితో ఈ రేటు 6.60 శాతానికి దిగివచ్చింది. హెడ్‌డీఎఫ్‌సీ రుణ రేటును 6.7 శాతానికి తగ్గించింది.

చదవండి: ఒక్క లోను పొందాలంటే వంద తిప్పలు.. అందుకే ‘నావి’ వచ్చింది

మరిన్ని వార్తలు