ఆర్థిక నేరగాళ్ల దెబ్బ.. బ్యాంకులకు భారీ కన్నం!

30 Mar, 2022 13:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బ్యాంకుల్లో మోసాలు, అక్రమాలు ఆగడం లేదు. కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మోసాలతో బ్యాంకులకు భారీ కన్నం పెడుతున్నారు. దీంతో దేశీయ బ్యాంకులు రోజుకు ఎంత లేదన్నా సగటున రూ.100 కోట్ల వరకు నష్టపోతున్నాయి. సాక్షాత్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఈ విషయాలు వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మొత్తం 27 షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో ఈ 96 గోల్‌మాల్‌ కేసులు బయటపడ్డాయి. ఈ సమయంలో కేటుగాళ్లు మొత్తం రూ.34,097 కోట్లు కొల్లగొట్టారు. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో అత్యధికంగా రూ.4,820 కోట్ల విలువైన మోసాలు జరిగితే, ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అత్యధికంగా 13 మోసాలు జరిగాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ సమాధానమిస్తూ బ్యాంకుల వారీగా రూ.100 కోట్లకు పైగా మోసాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలలో ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఈ మోసాలు జరిగాయి. ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలతో పాటు మోసగాళ్లు, ఎగవేతదారులను నిరోధించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రి తన సమాధానంలో తెలిపారు. 2015 ఏప్రిల్‌ 1 నుంచి గత ఏడాది డిసెంబరు నెలాఖరు వరకు దేశంలోని బ్యాంకుల్లో రూ.2.5 లక్షల కోట్ల విలువైన గోల్‌మాల్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. 

(చదవండి: మంటల్లో కాలిపోతున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈవీ రంగంపై నీలి నీడలు!)

మరిన్ని వార్తలు