కొత్త కస్టమర్లకు ఆచితూచి రుణాలు

26 Aug, 2020 07:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు రుణ సంస్థలు పోటీపడుతుంటాయి. ఇందుకోసం వడ్డీ  లేని రుణాలను జీరో డౌన్‌పేమెంట్‌తో ఆఫర్‌ చేయడం చూశాం. కోవిడ్‌–19 పుణ్యమాని  ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఇబ్బడిముబ్బడిగా రుణాలను అందించిన ఈ సంస్థలు పాత బకాయిల వసూళ్లపై ప్రధానంగా  దృష్టిసారించాయి. దీంతో నూతన వినియోగదార్లకు రుణం దొరకడం కష్టంగా మారింది. వీరి విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కస్టమర్‌ ట్రాక్‌ రికార్డు ఆధారంగానే తాజాగా రుణాలను జారీ చేస్తున్నాయి. 

కీలకంగా సిబిల్‌ స్కోరు.. 
వినియోగదారులకు రుణం మంజూరు చేసేందుకు బ్యాంకులు, రుణ సంస్థలు సిబిల్‌ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. సిబిల్‌ స్కోరు కనీసం 750 ఉంటే లోన్‌ మంజూరు చేసేవి. నూతన మార్పుల ప్రకారం లోన్‌ కోసం వచ్చే కొత్త కస్టమర్‌కు ఇప్పుడీ స్కోరు కనీసం 775 ఉండాల్సిందే. లేదంటే సింపుల్‌గా నో అని చెప్పేస్తున్నాయి. పాత కస్టమర్ల విషయంలో సిబిల్‌ స్కోరు కనీసం 750 ఉంటేచాలని ఓ ప్రముఖ సంస్థ ప్రతినిధి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. గతంలో వారు తీసుకున్న రుణాల తాలూకు చెల్లింపులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్లలో 35 శాతంగా ఉన్న ఈఎంఐల వాటా ఇప్పుడు 10 శాతానికి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

కస్టమర్లకు సౌకర్యంగా.. 
బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి కంపెనీలు కస్టమర్ల కోసం 18 నెలల వరకు రుణాన్ని చెల్లించే సౌకర్యాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. గతంలో ఇది 6–10 నెలల వరకే ఉండేదని ఓ సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించా రు. ‘కోవిడ్‌–19 తర్వాత వినియోగదార్ల కొనుగోలు శక్తి తగ్గింది. ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారు. అందుకే వారి సౌలభ్యం కోసం వాయిదాల సంఖ్యను పెంచాం’ అని ఆయన అన్నారు. అయితే గతంలో జీరో డౌన్‌పేమెంట్‌ ఉండేది. ఇప్పుడు కనీసం 30–35 శాతం ముందుగా చెల్లించాల్సిందే. బ్రాండ్, రుణ సంస్థనుబట్టి కస్టమర్ల నుంచి స్వల్ప వడ్డీని కూడా వసూలు చేస్తున్నాయి. కొన్ని రుణ సంస్థలు ప్రాసెసింగ్‌ ఫీజు చార్జీ చేస్తున్నాయని ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు