ఆర్థిక సంక్షోభంలో లంక, ఇరాన్‌ రుణం తీర్చేందుకు ఏం చేస్తోందంటే..

23 Dec, 2021 12:23 IST|Sakshi

వస్తు మార్పిడి.. తెలియని విషయమేం కాదు. పాతరోజుల్లో బాగా ఆచరణలో ఉండేది. కరెన్సీ వాడకంలోకి వచ్చాక.. క్రమంగా తగ్గిపోయింది.  అయితే దేశాల మధ్య రుణ ఒప్పందాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి కదా. ఈ క్రమంలో గ్లోబల్‌ ట్రేడింగ్‌లో ఇప్పుడు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 


శ్రీలంక, ఇరాన్‌ నుంచి కొన్ని ఏళ్లుగా ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఈ మేరకు నాలుగేళ్లుగా 251 మిలియన్‌ డాలర్ల విలువైన రుణం పేరుకుపోయింది. దీనిని తీర్చేందుకు సంచలన ప్రకటన చేసింది ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వం. రుణాన్ని ధన రూపేణ కాకుండా.. వస్తుమార్పిడి రూపంలో తీరుస్తామని, ఈమేర విలువ చేసే సిలోన్‌ టీ ఉత్పత్తులను ఇరాన్‌కు అందిస్తామని పేర్కొంది. గత యాభై ఏళ్లలో విదేశీ వాణిజ్యంలో ఈ తరహా ప్రకటన చేసిన దేశం శ్రీలంకే కావడం విశేషం!.
 

ఇందుకు సంబంధించి శ్రీలంక మంత్రి రమేశ్‌ పాథిరానా అధికారికంగా ఓ ప్రకటన చేశారు. జనవరి నుంచి ప్రతీ నెలా 5 మిలియన్‌ డాలర్ల విలువ చేసే తేయాకు ఉత్పత్తులను ఇరాన్‌కు అందిచనున్నట్లు తెలిపారు. ఆయిల్‌ ఉత్పత్తుల విషయంలో ఇరాన్‌కి పడ్డ రుణం నాలుగేళ్లుగా పేరుకుపోతోంది. ఈ తరుణంలోనే లంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదా?

ఇదిలా ఉంటే యూఎన్‌, యూఎస్‌ ఆంక్షల పరిధిలో ‘టీ’ కూడా ఉంది. అయితే మానవతా కోణం దృష్ట్యా(ఎమర్జెన్సీ సందర్భాల్లో) టీ అనేది ఫుడ్‌ జాబితాలో ఉందని గుర్తు చేస్తోంది లంక ప్రభుత్వం. అంతేకాదు ఇరాన్‌ బ్యాంక్‌ల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు లంక ప్రకటించుకుంది. మరోవైపు శ్రీలంక గత కొంతకాలంగా అప్పుల ఊబిలో కూరుకుపోతూ వస్తోంది. విదేశీ మారకద్రవ్య సంక్షోభం, కరోనా ప్రభావంతో టూరిజం నిలిచిపోవడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

శ్రీలంక ప్రతీ ఏడాది 340 మిలియన్‌ కేజీల టీని ఉత్పత్తి చేస్తోంది. కిందటి ఏడాది 265 మిలియన్‌ కేజీల టీని ఎగుమతి చేయగా.. 1.24 బిలియన్‌ డాలర్లు సంపాదించింది. దేశం మొత్తం మీద ఐదు శాతం జనాభా తేయాకు ఆధారిత పనులతో జీవనం కొనసాగిస్తోంది. 


చదవండి: బ్రిటన్‌ను వెనక్కి నెట్టిన భారత్‌!

మరిన్ని వార్తలు