బీఏఎస్ఎఫ్- బజాజ్ ఎలక్ట్రికల్స్ జోరు

5 Nov, 2020 14:59 IST|Sakshi

క్యూ2(జులై- సెప్టెంబర్‌) ఫలితాల ఎఫెక్ట్‌

బీఏఎస్ఎఫ్ ఇండియా-​ 15 శాతం జూమ్

బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు 5 శాతం హైజంప్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో స్పెషాలిటీ కెమికల్స్ రంగ దిగ్గజం బీఏఎస్ఎఫ్ ఇండియా కౌంటర్‌కు డిమాండ్‌ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించడంతో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ కంపెనీ బజాజ్ ఎలక్ట్రికల్స్ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

బీఏఎస్ఎఫ్ ఇండియా
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో బీఏఎస్ఎఫ్ ఇండియా నికర లాభం రూ. 412 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ2లో కేవలం రూ. 2.3 కోట్ల లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 2067 కోట్ల నుంచి రూ. 2,463 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో కన్ స్ట్రక్షన్ కెమికల్స్ బిజినెస్ విక్రయం ద్వారా రూ. 465 కోట్లకుపైగా లాభం ఆర్జించింది. ఫలితాల నేపథ్యలో ప్రస్తుతం బీఏఎస్ఎఫ్  షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 1,525 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 15 శాతంపైగా ర్యాలీ చేసింది. రూ. 1,557ను అధిగమించింది.

బజాజ్ ఎలక్ట్రికల్స్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో బజాజ్ ఎలక్ట్రికల్స్ రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2లో రూ. 36.5 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 11 శాతం పెరిగి రూ. 1,218 కోట్లకు చేరింది. రూ. 73 కోట్ల ఇబిటా ఆర్జించింది. గత క్యూ2లో రూ. 29 కోట్ల పన్నుకు ముందు నష్టం నమోదైంది. ఈ నేపథ్యంలో బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం జంప్ చేసి రూ. 510 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 515 వరకూ ఎగసింది.

మరిన్ని వార్తలు