సినిమా థియేటర్స్‌లో బ్యాటిల్‌ గ్రౌండ్‌

5 Oct, 2021 07:52 IST|Sakshi

నాడ్‌విన్‌తో పీవీఆర్‌ జట్టు 

హైదరాబాద్‌ స్క్రీన్‌లలో ప్రయోగాత్మక ప్రదర్శన 

న్యూఢిల్లీ: గేమ్స్‌కి సంబంధించి లైవ్‌ టోర్నమెంట్‌లను థియేటర్లలో వెండి తెరపై ప్రదర్శించే దిశగా ఈ–స్పోర్ట్స్‌ కంపెనీ నాడ్‌విన్‌ గేమింగ్‌తో జట్టు కట్టినట్లు థియేటర్ల చెయిన్‌ పీవీఆర్‌ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు ముంబై, గురుగ్రామ్, ఇండోర్‌ వంటి నాలుగు నగరాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ చీఫ్‌ ఆఫ్‌ స్ట్రాటజీ కమల్‌ జ్ఞాన్‌చందాని తెలిపారు.

సిల్వర్‌ స్క్రీన్‌పై
ఈ మధ్య ప్రాచుర్యం పొందిన బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (బీజీఎంఐ) కాంపిటీషన్‌ను ఆయా నగరాల్లోని థియేటర్లలో లైవ్‌గా చూపించనున్నట్లు వివరించారు. గేమర్లు ప్రారంభ రౌండ్లను మొబైల్‌లో పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని తదుపరి క్వార్టర్, సెమీస్, ఫైనల్స్‌ను సినిమా హాళ్లలో ప్రదర్శిస్తామని కమల్‌ వివరించారు.

అక్టోబరు 7న
తొలి రౌండు చాంపియన్‌షిప్‌ అక్టోబర్‌ 7న గురుగ్రామ్‌లోని పీవీఆర్‌ యాంబియన్స్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో ప్లేయర్లు తమ ఫోన్లు లేదా చేతి పరికరాల్లో ఆడే గేమ్‌ను వెండి తెరపై ప్రదర్శిస్తామని .. అదనంగా కామెంటరీ, గ్రాఫిక్స్, చర్చలు వంటి హంగులన్నీ కూడా ఉంటాయని కమల్‌ పేర్కొన్నారు. పీవీఆర్‌కు భారత్, శ్రీలంకలోని 72 నగరాల్లో 842 స్క్రీన్లు ఉన్నాయి.

చదవండి : Netflix: ఆ వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..!

మరిన్ని వార్తలు