బేయర్ క్రాప్‌సైన్స్‌ -టొరంట్‌.. లాభాల పవర్‌

7 Aug, 2020 13:10 IST|Sakshi

క్యూ1 ఫలితాల జోష్‌

సరికొత్త గరిష్టానికి బేయర్ క్రాప్‌సైన్స్‌

5 శాతం జంప్‌చేసిన టొరంట్‌ పవర్‌

52 వారాల గరిష్టానికి టొరంట్‌ పవర్‌ షేరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో సస్య రక్షణ రంగ దిగ్గజం బేయర్‌ క్రాప్‌సైన్స్‌  కౌంటర్‌కు భారీ డిమాండ్‌ కనిపిస్తోంది. ఇదే కాలం(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్‌ రంగ కంపెనీ టొరంట్‌ పవర్‌కౌంటర్‌ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

బేయర్‌ క్రాప్‌సైన్స్
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో బేయర్‌ క్రాప్‌సైన్స్‌ నికర లాభం 86 శాతం ఎగసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 252 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 29 శాతం పుంజుకుని రూ. 1,228 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బేయర్‌ క్రాప్‌సైన్స్‌ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 6,174 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 15 శాతం దూసుకెళ్లి రూ. 6,450కు చేరింది. వెరసి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది!

టొరంట్‌ పవర్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో టొరంట్‌ పవర్‌ రూ. 373 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1తో పోలిస్తే ఇది35 శాతం వృద్ధికాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 19 శాతం నీరసించి రూ. 3,042 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టొరంట్‌ పవర్‌ షేరు 5.2 శాతం జంప్‌చేసి రూ. 345 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 358 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం!

మరిన్ని వార్తలు