ఐపీఎల్‌ టీం... ఇప్పుడు మరింత కాస్ట్‌లీ గురు!

31 Aug, 2021 13:30 IST|Sakshi

మోస్ట్‌ పాపులర్‌ స్పోర్టింగ్ ఈవెంట్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు పాలిట కామధేనువులా మారింది. పుష్కరకాలంగా కాసుల వర్షం కురిపిస్తోంది. రాబోయే 2022 సీజన్‌కి రెండు కొత్త జట్ల రాకతో బీసీసీఐ ఆదాయానికి అదనంగా రూ. 5000 కోట్లు వచ్చి చేరతాయని అంచనా.

పెరగనున్న బేస్‌ ప్రైస్‌ ?
ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఎనిమిది జట్లు ఉన్నాయి. వచ్చే సీజన్‌కి ఈ సంఖ్యను పది జట్లకు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ రెండు జట్లు సొంతం చేసుకునేందుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి బిడ్లను స్వీకరించనుంది బీసీసీఐ. అయితే ఇంతకు ముందు కొత్తగా ఒక జట్టును సొంతం చేసుకోవాలంటే కనీస ధరగా రూ. 1700 కోట్లుగా నిర్ణయించింది.

‘అయితే ప్రస్తుతం బీసీసీఐ యాక్షన్‌ ప్లాన్‌లో మార్పులు చోటు చేసుకున్నాయని, ఒక్కో జట్టుకు బేస్‌ ప్రైస్‌గా రూ. 2000 కోట్లను నిర్ణయించబోతున్నట్టు’ పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీసీసీఐ ప్రతినిధి పీఐటీ వార్త సంస్థకు తెలియజేశారు. ఈ మార్పుతో బీసీసీఐకి కనీసం రూ.5000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.

టర్నోవర్‌ రూ. 3000 కోట్లు దాటితేనే
కొత్త జట్లను సొంతం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా అనేక కార్పొరేట్‌ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే బీసీసీఐ నిబంధనలు వీరికి అడ్డుగా ఉన్నాయి.ఐపీఎల్‌ జట్టును సొంతం చేసుకోవాలనుకునే కంపెనీ వార్షిక టర్నోవరు కనీసం రూ.3000 కోట్లు దాటి ఉండాలని బీసీసీఐ పేర్కొంటోంది. ఐపీఎల్‌ బిడ్డింగ్‌ పత్రాలను రూ. 75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

కన్సార్టియంలకు అవకాశం
బ్రాండ్‌ ప్రచారానికి విపరీతమైన హైప్‌ తెచ్చిపెట్టే ఐపీఎల్‌ జట్టును కొనేందుకు ఎక్కువ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నా బేస్‌ ప్రైస్‌ ఎక్కువగా ఉండటం ఇబ్బందిగా మారింది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు రెండు లేదా మూడు కంపెనీలు కలిసి కన్సార్టియంగా ఏర్పడి బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. అయితే గరిష్టంగా మూడు కంపెనీలకే అవకాశం కల్పించాలని యోచిస్తోంది.

కొత్తగా ఇక్కడేనా ?
అహ్మదాబాద్‌, లక్నో, పుణే ఈ మూడింటిలో రెండింటికి కొత్తగా టీమ్‌లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో పుణే, గుజరాత్‌ల పేరుతో గతంలో ఐపీఎల్‌ టీమ్‌లు కొనసాగాయి. ప్రపంచంలోనే  అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం అహ్మదాబాద్‌లో అందుబాటులోకి రావడంతో అహ్మదాబాద్‌కి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు సమాచారం. ఇక లక్నో ఎక్‌నా స్టేడియం కెపాసిటీ కూడా ఎక్కువే. అదాని, ఆర్‌పీజీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌లతో పాటు ప్రముఖ ఫార్మా, బ్యాంకింగ్‌ కంపెనీలు ఐపీఎల్‌ జట్టును సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. 

చదవండి : Zomato: యాడ్‌ల దుమారం, మండిపడుతున్న నెటిజనులు

మరిన్ని వార్తలు