‘చిన్నారుల భద్రత’ కోసం గూగుల్‌ కార్యక్రమం

26 Aug, 2021 03:30 IST|Sakshi

‘అమర్‌ చిత్రకథ’తో భాగస్వామ్యం

న్యూఢిల్లీ: భారత్‌లో చిన్నారులకు ఇంటర్నెట్‌ భద్రతపై అవగాహన కల్పించేందుకు గూగుల్‌ తన గ్లోబల్‌ ‘బీ ఇంటర్నెట్‌ అవెసమ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హాస్య పుస్తక ప్రచురణలకు ప్రసిద్ధి చెందిన ‘అమర్‌ చిత్ర కథ’ భాగస్వామ్యంతో ఎనిమిది భారతీయ భాషల్లో ఇంటర్నెట్‌ భద్రతకు సంబంధించి పాఠాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ఇంటర్నెట్‌ యూజర్ల భద్రతను పెంచేందుకు మెరుగుపరిచిన ‘గూగుల్‌ సేఫ్టీ సెంటర్‌’ను ఎనిమిది భారతీయ భాషల్లో ప్రారంభించింది.

భారత్‌లోని భద్రతా బృందంలో మానవ వనరులను కూడా గణనీయంగా పెంచినట్టు తెలిపింది. దీంతో తప్పుడు సమాచారం, మోసాలు, చిన్నారుల భద్రతకు ముప్పు, నిబంధనల ఉల్లంఘన, ఫిషింగ్‌ దాడులు, మాల్వేర్‌కు వ్యతిరేకంగా మరింత గట్టిగా పనిచేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. ‘‘నిత్యం ఇంటర్నెట్‌ పట్ల చాలా మంది తమ నమ్మకాన్ని చాటుతున్నారు. నూతన సేవలను స్వీకరిస్తున్నారు. వారి విశ్వాసాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని గూగుల్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ సంజయ్‌గుప్తా పేర్కొన్నారు.
   

మరిన్ని వార్తలు