బేర్‌ గుప్పిట్లోకి... మార్కెట్‌

28 Jan, 2021 04:33 IST|Sakshi

ఎఫ్‌ అండ్‌ ఓ గడువు ముగింపు నేపథ్యంలో అప్రమత్తత

కలసిరాని అంతర్జాతీయ మార్కెట్లు

938 పాయింట్లు కోల్పోయి 48 వేల దిగువకు సెన్సెక్స్‌ 

271 పాయింట్ల నష్టంతో 14 వేల కిందికి నిఫ్టీ 

నాలుగు రోజుల పతనంతో జనవరి లాభాలు మాయం

ముంబై: బడ్జెట్‌ భయాలతో భారత స్టాక్‌ మార్కెట్‌ బుధవారం బేర్‌ గుప్పిట్లో విలవిల్లాడింది. అలాగే జనవరి ఎఫ్‌ అండ్‌æఓ డెరివేటివ్స్‌ గడువు ముగింపు నేపథ్యంలో అప్రమత్తత మార్కెట్‌ను మరింత భయపెట్టింది. ఫలితంగా సెన్సెక్స్‌ 48 వేల స్థాయిని కోల్పోయి 938 పాయింట్ల నష్టంతో 47,410 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 271 పాయింట్లు కోల్పోయి 14వేల దిగువన 13,967 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగో నష్టాల ముగింపు. మార్కెట్‌ మొదలైన మరుక్షణం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.

ట్రేడింగ్‌ కొనసాగే కొద్దే విక్రయాల ఒత్తిళ్లు పెరగడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,007 పాయింట్లు, నిఫ్టీ 310 పాయింట్లను కోల్పోయాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ షేర్లు మిగిలిన అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు నష్టపోయాయి. దేశీయ ఇన్వెస్టర్ల(డీఐఐ)తో పాటు విదేశీ ఇన్వెస్టర్లూ నికర అమ్మకందారులుగా మారి మొత్తం రూ.1,688 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.  

నాలుగురోజుల్లో నెల లాభాలు ఆవిరి...
మార్కెట్‌ నాలుగు రోజుల పతనంతో సూచీలు ఈ జనవరిలో ఆర్జించిన లాభాలన్నీ ఆవిరైపోయాయి. మొత్తం నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 2,382 పాయింట్లు, నిఫ్టీ 678 పాయింట్లను కోల్పోయాయి. ఇదే నెలలో సూచీలు అందుకున్న జీవితకాల గరిష్టస్థాయిల నుంచి ఐదుశాతం పతనాన్ని చవిచూసినట్లైంది.

నష్టాలకు నాలుగు కారణాలు... వెంటాడిన బడ్జెట్‌ భయాలు...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చేవారం మొదటిరోజు(ఫిబ్రవరి 1న)నే 2021–22 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్‌లో అధిక పన్ను విధింపునకు ఆస్కారం ఉందనే అంచనాలు ఇన్వెస్టర్లను భయపెట్టాయి. బడ్జెట్‌ తర్వాత కొనుగోళ్ల కోసం కొంత లిక్విడిటీ చేతుల్లో ఉంటే మంచిదనే ఆలోచనలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు కొందరు నిపుణులు తెలిపారు. గత పదేళ్ల కాలంలో కేవలం మూడుసార్లు మాత్రమే బడ్జెట్‌ ఈక్విటీ మార్కెట్‌ను మెప్పించిందనే విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు.  

బేరిష్‌గా మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి ...
భారత ఈక్విటీ మార్కెట్ల విదేశీ ఇన్వెస్టర్లు అనూహ్యంగా బేరిష్‌ వైఖరిని ప్రదర్శించడం మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనపరిచింది. గత మూడురోజుల నుంచి ఎఫ్‌ఐఐలు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపుతూ మొత్తం రూ.3,089 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎన్‌ఎస్‌డీఎల్‌ గణాంకాలు పేర్కొన్నాయి. దేశీయ కేంద్ర బడ్జెట్, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌బ్యాంక్‌ ద్రవ్యపరపతి సమావేశాలు లాంటి ప్రధాన ఈవెంట్ల నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు ‘‘వేచిచూసే ధోరణి’’ని ప్రదర్శిస్తున్నారని నిపుణులు తెలిపారు.  

నిరాశపరచిన క్యూ3 ఫలితాలు  
కొద్దిరోజులుగా కార్పొరేట్‌ కంపెనీలు వెల్లడిస్తున్న మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోతున్నాయి. అధిక మొత్తంలో మొండిబకాయిలను ప్రకటిస్తూ బ్యాంకింగ్‌ కంపెనీలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఆరి ్థక వ్యవస్థ పనితీరుకు అద్దంపట్టే బ్యాంకింగ్‌ రంగం బలహీనంగా ఉందనే సంకేతాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరిచాయి.  

ప్రపంచ మార్కెట్‌ నుంచి ప్రతికూల సంకేతాలు  
బలహీన అంతర్జాతీయ సంకేతాలు మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు ద్రవ్యపాలసీ విధాన నిర్ణయం కోసం ఎదురుచూపులతో పాటు అమెరికా ఉద్దీపన ప్యాకేజీ చుట్టూ నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా ఆసియాలో ప్రధాన దేశాల ఈక్విటీలతో పాటు యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. కాగా అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

రూ. 2.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం...
ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.2.6 లక్షల కోట్లను నష్టపోయారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.189 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఇక నాలుగురోజుల పతనంతో ఇన్వెస్టర్లు మొత్తం రూ.8 లక్షల కోట్లను కోల్పోయినట్లైంది.

మరిన్ని సంగతులు  

  • బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్స్, అపోలో హాస్పిటల్, సైయెంట్, రూట్‌ మొబైల్స్, యూపీఎల్‌ షేర్లు తాజాగా ఏడాది గరిష్టాన్ని తాకాయి.  
  • రియలన్స్‌ షేరు  2.50 శాతం క్షీణించి రూ.1900ల దిగువున రూ.1895 వద్ద స్థిరపడింది. అమెజాన్‌తో ఫ్యూచర్స్‌ గ్రూప్‌ కొనుగోలు వివాదంతో పాటు బలహీన క్యూ3 ఆర్థిక గణాంకాలన నమోదు షేరు పతనానికి కారణవుతోంది. మొత్తం మూడు రోజుల్లో 10 శాతం నష్టపోయింది.   
  • ఎఫ్‌అండ్‌ఓ ముగింపు గడువు ముగింపు నేపథ్యంలో మార్కెట్లో అస్థిరతను సూచించే వీఎక్స్‌ఐ ఇండెక్స్‌ ఐదు శాతం పెరిగి 24.39 వద్ద స్థిరపడింది.  
     
మరిన్ని వార్తలు