అపార్ట్‌మెంట్‌ ప్రారంభ ధర రూ.30 కోట్లు.. రెంట్‌ నెలకు రూ.10లక్షలు!

10 Mar, 2023 12:57 IST|Sakshi

గగనమే హద్దుగా రియల్‌ ఎస్టేట్‌లో ఆకాశహర్మ్యాల కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకదాన్ని మించి మరోటి పోటీపడుతున్నాయి. ముఖ్యంగా భూతల స్వర్గాన్ని తలపించే బెంగళూరులో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రాంతం యూబీ సిటీ (ubcity-United Breweries)లో అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు నింగిలోని చుక్కలను తాకేలా నిర్మిస్తున్నాయి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు. ఇప్పుడు వాటిని సొంతం చేసుకునేందుకు బిలియనీర్లు పోటీపడుతున్నారు. ఇక్కడ ఒక్కో అపార్ట్‌ మెంట్‌లలో ఫ్లాట్‌ ధర కోట్లలో ఉంటే రెంట్‌ లక్షల్లో ఉంది. 

బెంగళూరులో విలాసవంతమైన జిల్లాగా ప్రసిద్ధి చెందిన యూబీ సిటీలో లగ్జరీ మాల్ (ది కలెక్షన్), విశాలమైన ఆఫీస్‌ స్పేస్‌ కార్యాలయాలు, ఓక్‌వుడ్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లు, బిలియనీర్స్ టవర్‌ (కింగ్‌ఫిషర్ టవర్స్)తో పాటు అన్నీ రంగాలకు చెందిన ఆఫీస్‌ కార్యకలాపాలు ఇక్కడే జరుగుతున్నాయి.  

విజయ్‌ మాల్య తండ్రి విటల్‌ మాల్య రోడ్డులో
విజయ్‌ మాల్య తండ్రి విటల్‌ మాల్య రోడ్డులో యూబీ సిటీ, కింగ్‌ ఫిషర్‌ ప్లాజా, కాంకోర్డ్, కాన్‌బెర్రా, కామెట్, కింగ్‌ఫిషర్ టవర్స్ అంటూ 6 బ్లాకుల్లో  మొత్తం 16 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టారు విజయ్‌ మాల్య. 2004లో ప్రారంభమైన ఇక్కడి నిర్మాణాలు 2008లో పూర్తయ‍్యాయి. నాటి నుంచి ఆ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందుతూ బెంగళూరుకు దిక్సూచిలా మారింది. అందుకే కాబోలు అక్కడ నివసించేందుకు బడ బడా వ్యాపార వేత్తలు కోట్లు కుమ్మరించి ఫ్లాట్ల కొనుగోలు కోసం ఎదురు చూస్తుంటారు.

2014-2016లో ఆ ప్రాంతాన్ని మరింత అభిృద్ది చేసేందుకు మాల్యా ఆధీనంలోని ఓ సంస్థ రూ.1500 కోట్లు పెట్టుబడులు పెట్టింది. వెరసీ ఆ ఏరియాలో 8వేల స్కైర్‌ ఫీట్‌ అపార్ట్‌ మెంట్‌ ధర రూ. 35వేలతో ప్రారంభ విలువ రూ.30 కోట్లకు పైగా పెరిగిందని, సగటు నెలవారీ అద్దె రూ.10 లక్షలుగా ఉందని స్థానిక రియల్టర్స్ చెబుతున్నారు.

ప్రముఖుల నుంచి దిగ్గజ సంస్థల వరకు 
ఇక బీఎండబ్ల్యూ, ఫోర్సే, హార్లే డేవిడ్‌సన్ వంటి కంపెనీలకు చెందిన షోరూమ్స్ ఇక్కడ ఉన్నాయి. లూయిస్ విట్టన్, డీజిల్, రోలెక్స్ వంటి లగ్జరీ బ్రాండ్స్ షాప్స్ ఉండడంతో యూబీ సిటీ బెంగళూరు వాసులకు వీకెండ్ గమ్యస్థానంగా మారింది. ఈ అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్ క్వార్టర్స్‌లో బయోకాన్‌ కిరణ్ మజుందార్ షా, ఫ్లిప్‌కార్ట్‌ సచిన్ బన్సాల్, మెన్సా బ్రాండ్స్ అనంత్ నారాయణన్, జెరోధా నిఖిల్ కామత్‌లతో పాటు మరికొందరు వ్యాపారవేత్తలు నివాసం ఉంటున్నారు.

మరిన్ని వార్తలు