Lay off: ‘మేం పీకేశాం.. వారికి ఎవరైనా జాబ్‌ ఇవ్వండి ప్లీజ్‌’

3 Aug, 2023 22:23 IST|Sakshi

బెంగళూరుకు చెందిన ఫామ్‌పే అనే స్టార్టప్ సంస్థ ఒకేసారి 18 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు తాజాగా  ప్రకటించారు. హైపర్-గ్రోత్ నుంచి సస్టైనబిలిటీకి తమ ఫోకస్ మారడం వల్ల తొలగింపులు తప్పడం లేదని ఫామ్‌పే కో ఫౌండర్‌ సంభవ్ జైన్ ఎక్స్ (ట్విటర్) ద్వారా తెలియజేశారు.

అయితే తాము తొలగించిన సిబ్బందికి ఎవరైనా జాబ్‌ ఇవ్వాలని రిక్రూటర్లను అభ్యర్థించాడు ఆ ఫిన్‌టెక్ యాప్ సహ వ్యవస్థాపకుడు. ఇక మరో కో ఫౌండర్‌ కుష్ తనేజా కూడా సంభవ్‌ జైన్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఉద్యోగాలు కోల్పోయినవారు కొత్త జాబ్‌ పొందేలా సహాయం చేయాలని కోరారు.

‘ఈరోజు చాలా కఠినమైన రోజు. ఎందుకంటే 18 మంది ఉద్యోగులను వదులుకోవాల్సి వచ్చింది. ఓ ఫౌండర్‌గా ఇది నాకు చాలా కష్టమైన పని. ఉద్యోగులను వదులుకోవడం తమలాంటి ‘పీపుల్‌ ఫస్ట్‌’ సంస్థలకు అంత సులభం కాదు’ అని  సంభవ్‌ జైన్ ట్వీట్‌ చేశారు. తాను, తనేజా సంవత్సరాలుగా తాము నిర్మించుకున్న జట్టు గురించి చాలా గర్విస్తున్నామన్నారు. బాధిత ఉద్యోగులకు తగిన జాబ్‌లను తాము అందించలేకపోయామన్నారు. వీరిని ఎవరైనా నియమించుకోవాలని కోవాలని కోరారు.

తనేజా కూడా ట్వీట్ చేస్తూ 18 మంది ఉద్యోగులను విడిచిపెట్టవలసి వచ్చినందున ఈ రోజు తమకు చాలా విచారకరమైన రోజు అని పేర్కొన్నారు.  ఫామ్‌పే సంస్థను నిర్మించడంలో వారి సహకారానికి మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటామన్నారు. ఇలాంటి అసాధారణ ప్రతిభావంతులకు అవకాశం ఇవ్వాలని ఇందు కోసం తమను సంప్రదించాలని రిక్రూటర్లను అభ్యర్థించారు. అయితే వీరి పోస్ట్‌లపై యూజర్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలా మంది వీరిని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు.

మరిన్ని వార్తలు