మీ చిన్నారుల భవిష్యత్తు కోసం.. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి!

1 Aug, 2022 07:19 IST|Sakshi

చిన్నారుల భవిష్యత్తు అవసరాల కోసం ఓ చక్కని నిధిని సమకూర్చుకోవాలని భావించే వారి ముందు ఉన్న పెట్టుబడి సాధనాల్లో ఈక్విటీలకు మించినది మరేదీ లేదనే చెప్పుకోవాలి. ఈక్విటీల్లో మంచి పథకాలను ఎంపిక చేసుకుని సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ రూపంలో (సిప్‌) దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తూ వెళితే సగటు వార్షిక రాబడి 15 శాతం, అంతకంటే ఎక్కువే ఆశించొచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని భావిస్తే, హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్స్‌ గిఫ్ట్‌ ఫండ్‌ ను పరిశీలించొచ్చు.

సెబీ సొల్యూషన్‌ ఓరియంటెడ్‌ ఫండ్స్‌ విభాగంలోకి ఇది వస్తుంది. ఈ పథకంలో పెట్టుబడులకు ఐదేళ్ల పాటు లాకిన్‌ ఉంటుంది. అంటే ఐదేళ్ల వరకు పెట్టుబడులను వెనక్కి తీసుకోలేరు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేస్తున్నారు కనుక ఐదేళ్లలోపు పెట్టుబడులను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడదు. మోస్తరు రిస్క్‌ భరించగలిగే వారికి హెచ్‌డీఎఫ్‌సీ చిల్ట్రన్స్‌ గిఫ్ట్‌ ఫండ్‌ అనుకూలం. 

పెట్టుబడుల విధానం/రాబడులు
ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడి 7 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ కేటగిరీ రాబడి 4.5 శాతంగానే ఉంది. ఇక మూడేళ్ల కాలంలో 17 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. ఐదేళ్ల కాలంలో 11 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 15 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించింది. మైనర్‌ పేరిటే (18 ఏళ్ల లోపు) ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేయడానికి అవకాశం ఉంటుంది.

సంబంధిత చిన్నారి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడి పేరిట వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించక్కర్లేదు. ఫండ్స్‌ యూనిట్లు ఎన్నున్నాయో వాటి విలువకు పది రెట్లు, గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఈ బీమా ఉంటుంది. అస్థిరతల రిస్క్‌ను తగ్గించుకునేందుకు సిప్‌ ద్వారా ఇందులో ఇన్వెస్ట్‌ చేసుకోవడం అనుకూలం. 

పనితీరు విధానం 
ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌ మాదిరిగా హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్‌ గిఫ్ట్‌ ఫండ్‌ పనిచేస్తుంది. డెట్‌ సాధనాల్లో, ఈక్విటీలోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది. కనుక అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే రిస్క్‌ కొంత తక్కువగా ఉంటుంది. ఒక విభాగంలో ప్రతికూలతలు ఎదురైనప్పుడు మరో విభాగం నుంచి కొంత కుషన్‌ ఉంటుంది. రూ.5,217 కోట్ల పెట్టుబడులు ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 65.7 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించింది.

డెట్‌ సాధనాల్లో 20 శాతం ఇన్వెస్ట్‌ చేయగా, 14.3 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. మార్కెట్ల వ్యాల్యూషన్లు గరిష్టానికి చేరాయని భావించినప్పుడు కొంత మేర ఈక్విటీ పెట్టుబడులను విక్రయించి నగదు నిల్వలను పెంచుకుంటుంది. తద్వారా కరెక్షన్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి నిల్వలను పెంచుకుంటుంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 47 స్టాక్స్‌ వరకు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడుల్లో 20 శాతం బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగ కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత క్యాపిటల్‌ గూడ్స్‌ రంగానికి 10 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 8 శాతం మేర కేటాయింపులు చేసింది. 

మరిన్ని వార్తలు