పెట్టుబడులు పెడితే రిస్క్‌ లేకుండా రాబడినిచ్చే ప్లాన్‌ ఇదే!

25 Apr, 2022 12:47 IST|Sakshi

మన ప్రతి పెట్టుబడి ప్రణాళికలోనూ.. ఇన్వెస్ట్‌ చేసే ప్రతి పైసా వెనుక భవిష్యత్‌లో ఆర్థిక భద్రత ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. ఈక్విటీల్లాంటి ఆర్థిక సాధనాలు దీర్ఘకాలంలో అధిక రాబడులు అందించే అవకాశాలు ఉన్నా.. అదే స్థాయిలో రిస్కులు కూడా పొంచి ఉంటాయి. అలా కాకుండా భవిష్యత్‌ అవసరాల కోసం ఆర్థిక భరోసానిచ్చే ఇతరత్రా సాధనాలు కూడా ఉన్నాయి. గ్యారంటీడ్‌ ఇన్‌కం ప్లాన్‌ ఇదే కోవకి చెందినది. 

గ్యారంటీడ్‌ ఇన్‌కం ప్లాన్‌ అంటే.. 
సాధారణంగా కచ్చితమైన రాబడి హమీని కూడా అందించే జీవిత బీమా ప్లాన్లను గ్యారంటీడ్‌ ఇన్‌కం పథకాలుగా వ్యవహరిస్తుంటారు. పేరుకు తగ్గట్లుగానే ఎటువంటి అనిశ్చితి లేకుండా ఈ పథకాలు ముందుగా పేర్కొన్నట్లు కచ్చితమైన రాబడులు అందించేవిగా ఉంటాయి. ఈ తరహా ప్లాన్లలో ప్రీమియం చెల్లింపు వ్యవధి, లేదా పాలసీ నిబంధనల ప్రకారం నిర్దిష్ట కాలపరిమితి ముగిసిన తర్వాత క్రమానుగతంగా నెలవారీ, మూడు .. లేదా ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారి చొప్పున ఇన్సూరెన్స్‌ కంపెనీ నిర్దిష్ట చెల్లింపులను ప్రారంభిస్తుంది. గ్యారంటీడ్‌ ప్లాన్లతో మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. 

సులభతరంగా ఆర్థిక లక్ష్యాల సాధన.. 
జీవితంలో కొన్ని లక్ష్యాలు చాలా సరళమైనవిగా ఉంటాయి. వాటి కోసం తీవ్రంగా ప్రణాళికలు అవసరం ఉండదు. ఉదాహరణకు ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పాటు కోసమో లేదా విహార యాత్రల కోసమో ఏళ్ల తరబడి ప్లాన్‌ చేసుకుంటూ గడిపేయనక్కర్లేదు. అయితే, మీ సొంతింటి కలను సాకారం చేసుకోవడం లేదా రిటైర్మెంట్‌ నిధిని సమకూర్చుకోవడం వంటి అవసరాల కోసం మాత్రం ప్లానింగ్‌ చేసుకోవాలి. క్రమశిక్షణతో ఇన్వెస్ట్‌ చేయాలి. జీవితంలో కీలకమైన ఆర్థిక లక్ష్యాలను కొంత సులభంగా సాధించుకోవడంలో గ్యారంటీడ్‌ ఇన్‌కం ప్లాన్‌ మీకు తోడ్పాటునిస్తుంది. మీరు మీ హోమ్‌ లోన్‌ ఈఎంఐ తిరిగి చెల్లించేసేందుకు, తద్వారా మీపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, క్రమానుగతంగా వచ్చే రాబడులను మీ పిల్లల ఉన్నత విద్య అవసరాల కోసం కూడా వాడుకోవచ్చు. 

అదనపు ఆదాయ మర్గం.. 
మీ భవిష్యత్‌ లక్ష్యాల కోసం ఇతరత్రా పెట్టుబడులు ఉన్నప్పటికీ.. మీ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ఈ తరహా ప్లాన్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరిగే ఖర్చులను ఎదుర్కొనేందుకు మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ వేతనానికి తోడుగా.. అదనపు ఆదాయ వనరుగా తోడ్పడగలదు. ఇక రిటైర్మెంట్‌ తర్వాత మీ ప్రాథమిక ఆదాయ వనరు స్థానాన్ని తీసుకోగలదు.  

మార్కెట్‌ ఒడిదుడుకుల నుంచి రక్షణ.. 
మార్కెట్‌ ఒడిదుడుకుల నుంచి రక్షణ ఉండటం కూడా ఇలాంటి గ్యారంటీడ్‌ ఇన్‌కం ప్లాన్లతో మరో ప్రయోజనం. మీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులు అధికంగా ఉంటే .. రిస్కులు కూడా ఎక్కువే ఉంటాయి. ఒక్కసారి మార్కెట్లు కుప్పకూలాయంటే చాలా నష్టాలు ఎదుర్కొనాల్సి వస్తుంది. పోర్ట్‌ఫోలియోకు రిస్కులు తగ్గించేలా గ్యారంటీడ్‌ ఇన్‌కం ప్లాన్‌ ఉపయోగపడుతుంది. స్టాక్‌ మార్కెట్ల ఒడిదుడుకులు, రిస్కులు అంతగా ఇష్టపడని వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, కచ్చితమైన రాబడులు అందిస్తుంది కాబట్టి రిస్కులు తీసుకునే వారికి కూడా ఇవి అనువైనవే. 

చివరిగా చెప్పాలంటే.. పైన చెప్పుకున్న ప్రయోజనాలతో పాటు మీకు జీవిత బీమా కవరేజీ కూడా ఈ తరహా పథకాలతో లభిస్తుంది. తద్వారా మీరు మీ భవిష్యత్‌కు ఆర్థికంగా రక్షణ కల్పించుకోవడంతో పాటు ఏదైనా అనుకోనిది జరిగినా మీ కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా గ్యారంటీడ్‌ ఇన్‌కం ప్లాన్లు ఉంటాయి. అంతే కాదు ప్రీమియంలకు పన్నులపరంగా డిడక్షన్లు పొందవచ్చు. వచ్చే రాబడులపై పన్నుల భారం ఉండదు.  

మరిన్ని వార్తలు