మంచి పనితీరు చూపించే టాప్‌ ఫండ్స్‌లో ఇది ఒకటి!

19 Dec, 2022 07:50 IST|Sakshi

ఆర్‌బీఐ రెపో రేట్ల పెంపుతో కొంత కాలంగా డెట్‌ మార్కెట్లు అస్థిరతలను చూస్తున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఆర్‌బీఐ వరుసగా రేట్లను పెంచుతూనే వస్తోంది. ఇప్పటికే 2.25 శాతం వడ్డీ రేట్లు పెరిగాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే ఉన్నందున, రానున్న కాలానికి అస్పష్టత నెలకొంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులకు అనువైనవి డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌.

పరిస్థితులకు తగినట్టు ఇవి స్వల్ప కాలం నుంచి దీర్ఘకాల సాధనాల మధ్య పెట్టుబడులను మార్చే సౌలభ్యంతో పనిచేస్తాయి. ఈ విభాగంలో ఎన్నో పథకాలు అంబాటులో ఉన్నాయి. మంచి పనితీరు చూపించే టాప్‌ ఫండ్స్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌ సీజన్స్‌ బాండ్‌ ఫండ్‌ ఒకటి.  

రాబడులు.. 
గడిచిన ఆరు నెలల్లో పెట్టుబడి 5 శాతం మేర వృద్ధి చెందగా, ఏడాది కాలంలో 4 శాతం ప్రతిఫలాన్నిచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో ఏటా 7.30 శాతం, ఐదేళ్లలో 7.26 శాతం, ఏడేళ్లలో 8.28 శాతం, పదేళ్లలో 9.28 శాతం చొప్పున రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. స్వల్పకాలంతో పోలిస్తే దీర్ఘకాలంలో రాబడి స్థిరంగా, మెరుగ్గా కనిపిస్తోంది. డైనమిక్‌ బాండ్‌ ఫండ్‌ విభాగం సగటు రాబడుల కంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌సీజన్స్‌ బాండ్‌ ఫండ్‌లోనే అధిక రాబడులు ఉన్నాయి. మూడేళ్లలో 1.5 శాతం, ఐదేళ్లలో 1.30 శాతం, ఏడేళ్లలో 1.5 శాతం, పదేళ్లలో 1.60 శాతం అధిక రాబడులు ఈ పథకం ఇవ్వడాన్ని గమనించాలి. ఈ పథకం ఆరంభమైన 2009 నుంచి చూస్తే వార్షిక రాబడి సుమారు 9 శాతంగా ఉంది. 

పెట్టుబడుల విధానం, పోర్ట్‌ఫోలియో.. 
ఈ విభాగంలో నిర్వహణ ఆస్తుల పరంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌ సీజన్స్‌ బాండ్‌ ఫండ్‌ అతిపెద్దది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.6,074 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా వేసినప్పుడు ఈ పథకం తన పోర్ట్‌ఫోలియోలోని సాధనాల డ్యురేషన్‌ను ( కాలవ్యవధి) పెంచుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని భావించినప్పుడు, ఆ ప్రయోజనాలను ఒడిసి పట్టేందుకు, మార్కెట్‌ టు మార్కెట్‌ నష్టాలను తగ్గించుకునేందుకు పోర్ట్‌ఫోలియోలోని డెట్‌ సాధనాల డ్యురేషన్‌ను తగ్గిస్తుంది.

స్థూల ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ పోర్ట్‌ఫోలియో డ్యురేషన్‌ మార్పులపై నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో ఈ పథకానికి ఎంతో అనుభవం ఉంది. ఈ పథకం కార్పొరేట్‌ బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీల్లోనూ (జీసెక్‌) ఇన్వెస్ట్‌ చేస్తుంది. కనుక వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో డ్యురేషన్‌ పథకంగా, వడ్డీ రేట్లు తగ్గే క్రమంలో అక్రూయల్‌ పథకంగా పనిచేస్తుంది. ఈ పథకం ఆరంభం నుంచి ఎన్నో పర్యాయాలు వడ్డీ రేట్ల సైకిల్‌ (పెరగడం, తరగడం)ను చూసింది. కనుక మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా వేగంగా, మెరుగైన నిర్ణయాలు తీసుకోడంలో కాస్త అనుభవం ఎక్కువ. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియో సగటు డ్యురేషన్‌ 1.91 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుతం వడ్డీ రేట్ల పెరుగుదల సైకిల్‌లో ఉన్నాం. కనుక డ్యురేషన్‌ తక్కువగా ఉంది. మొత్తం పెట్టుబడుల్లో 38.2 శాతం ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్లలో కలిగి ఉంది. అంటే వడ్డీ రేట్లు పెరిగినా, తరిగినా రిస్క్‌ ఉండదు. 29 శాతం పెట్టుబడులను ఏఏ మైనస్‌ అంతకంటే మెరుగైన రేటింగ్‌ సాధనాల్లో కలిగి ఉంది. మొత్తం పెట్టుబడుల్లో 92.91 శాతాన్ని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయగా, 7.09 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది.

చదవండి: ఇది మరో కేజీఎఫ్‌.. రియల్‌ ఎస్టేట్‌ సంపాదన, భవనం మొత్తం బంగారమే!

మరిన్ని వార్తలు