వృద్ధులకు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయ మార్గాలివే!

2 May, 2022 07:35 IST|Sakshi

నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం నాకు ఉన్న మార్గాలు ఏంటి? – నారాయణ్‌ 
విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని సమకూర్చుకుని ఉండాలి. సీనియర్‌ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసరాల్లో కావాల్సినప్పుడు వెంటనే పొందే లిక్విడిటీ కూడా ఉండాలని కోరుకుంటారు. ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి. ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె  ఆదాయం, పెన్షన్‌ లేదా మరొకటి కావచ్చు. ఏటా ఎంత మొత్తం పెట్టుబడి నుంచి కావాలో స్పష్టతకు రావాలి. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే.

ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే కనుక ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కువ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకాస్త అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్‌ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయకూడదు. 30–40 శాతం చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లోనే ఉంచాలి.

ప్రభుత్వ హామీతో కూడిన పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌), ప్రధానమంత్రి వయవందన యోజన, పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ఇన్వెస్టర్‌ ఈ పథకాలు అన్నింటిలోనూ కలిపి రూ.34.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడి డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 30–40 శాతం మేర ఉండేలా ఏడాదికోసారి పెట్టుబడులను మార్పులు చేసుకోవాలి.  

డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ ఎన్‌ఏవీ పతనం అవుతుంటే నిశ్చితంగా ఉండొచ్చా? – గాయత్రి 
డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ అన్నవి వాటి నిర్వహణలోని పెట్టుబడులను దీర్ఘకాలం నుంచి స్వల్ప కాలానికి, స్వల్ప కాలం నుంచి దీర్ఘకాలానికి మార్చుకోగల సౌలభ్యంతో ఉంటాయి. ఈ పథకాలు ఎక్కువగా మధ్య కాలం నుంచి దీర్ఘకాలంతో కూడిన పెట్టుబడుల పత్రాలను నిర్వహిస్తుంటాయి. కనుక వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో ఈ పథకాలపై ప్రభావం పడుతుంది. ఇది ఎన్‌ఏవీ క్షీణించడానికి దారితీస్తుంది. ఈల్డ్స్‌ ఇక్కడి నుంచి ఇంకా పెరిగే అవకాశమే ఉంది. వడ్డీ రేట్లను అన్ని సమయాల్లోనూ ఊహించడం కష్టం.

కనుక ఇన్వెస్టర్లు తమ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టుకోవాలి. స్థిరాదాయ పథకాల్లో కొద్ది తేడాతో ఇంటరెస్ట్‌ రేట్‌ కాల్స్‌ను తీసుకునే పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివిధ కాల వ్యవధుల మధ్య పెట్టుబడులు మారుస్తూ ఎక్కువ రాబడులకు ప్రయత్నించే పథకాల కంటే.. అక్రూయల్‌ ఇన్‌కమ్‌పై ఆధారపడే నాణ్యమైన పోర్ట్‌ఫోలియోకు ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా సందర్భాల్లో షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ అన్నవి డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ కంటే మెరుగ్గా పనిచేస్తుంటాయి.

ఈ రెండింటి మధ్య 2010 నుంచి ఐదేళ్ల రోలింగ్‌ రాబడులను పోల్చి చూస్తే ఇదే తెలుస్తుంది. మీరు ఒకవేళ డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటే అవి రాబడులు ఇచ్చినా కానీ, ఫండ్‌ మేనేజర్‌ పెట్టుబడుల నిర్వహణకు అనుగుణంగా ఆటుపోట్లతో ఉంటాయి. తక్కువ ఆటుపోట్లతో స్థిరమైన రాబడులు కోరుకునే వారు షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.   

మరిన్ని వార్తలు