రూ. కోటితో రిటైర్‌.. ఆ మొత్తం ఎలా ఇన్వెస్ట్‌ చేస్తే మంచింది?

8 Nov, 2021 07:54 IST|Sakshi

రూ.కోటి నిధితో పదవీ విరమణ తీసుకున్న వ్యక్తి.. ఆ మొత్తాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్‌ చేసుకోవాలి?  – రిషి 
ఎంత ఆదాయాన్ని మీరు కోరుకుంటున్నారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. అలాగే, మీకు పెన్షన్‌ లేదా అద్దె ఆదాయం వంటి ఇతర ఆదాయ వనరులు ఉన్నాయా? అన్న విషయాలు కూడా ఇక్కడ ప్రధానం అవుతాయి. నెలవారీగా ఎంత ఆదాయం కావాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. మీ నిధి నుంచి ఎక్కువ ఆదాయం కోరుకుంటుంటే అప్పు డు ఎక్కువ రిస్క్‌ తీసుకుంటున్నట్టే అవుతుంది. వైవిధ్యమైన పెట్టుబడులతో వార్షికంగా 9–12 శాతం రాబడి సంపాదించుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే మీ నిధి నుంచి వార్షికంగా 6% మేర వినియోగించుకోవచ్చు. అప్పుడు నెలవారీ రూ.50,000 ఆదాయం పొందడమే కాకుండా.. మీ పెట్టుబడుల విలువ కాపాడుకోవడంతోపాటు.. భవిష్యత్తులో అధిక ఆదాయానికి వీలవుతుంది. జాగ్రత్తగా ప్రణాళిక రచించుకోవాలి.
అత్యవసర నిధికి లిక్విడ్‌ ఫండ్స్‌కు అనుకూలమేనా? అత్యవసరం ఏర్పడకపోతే అదే నిధి దీర్ఘకాలం పాటు అందులోనే ఉంటుంది. కనుక మూడు నెలలకు మించిన కాలానికి లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చా? – నిహార్‌ 
ఇన్వెస్ట్‌ చేసే ముందే వచ్చే ఏడాది అంతకంటే ఎక్కువ కాలం పాటు ఆ నిధితో అవసరం లేదనుకుంటే అప్పుడు లిక్విడ్‌ ఫండ్స్‌ తగిన ఎంపిక కావు. మీ పెట్టుబడుల కాలానికి అనుకూలమైన ఇతర డెట్‌ ఫండ్‌ విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కానీ, అత్యవసర నిధి అనేది.. అవసరం ఎదురైనప్పుడు వెనువెంటనే పొందేందుకు అనుకూలంగా ఉండాలి. కనుక ఈ నిధికి ఎక్కువ భద్రతతోపాటు, వెంటనే నగదుగా మార్చుకునే సౌలభ్యం కూడా ఉండాలి. అత్యవసర నిధి కోసం చూడాల్సిన అంశాలివే. అయితే, ఈ నిధి సాధారణంగా ఎక్కువ కాలం పాటు పెట్టుబడిగా కొనసాగుతుంటుంది. సాధారణంగా అవ్యవసరం ఏర్పడి, ఈ నిధిని తీసుకోవాల్సిన పరిస్థితి రాకూడదనే కోరుకుంటారు. అత్యవసరం ఎప్పుడొస్తుందన్నది అస్సలు ఊహించలేము. కనుక దీర్ఘకాలం పాటు కొనసాగినప్పటికీ అత్యవసర నిధి కోసం లిక్విడ్‌ ఫండ్స్‌ అనుకూలమే. దీనికి ప్రత్యామ్నాయంగా బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలో ఉంచుకోవాలి. కానీ, రాబడి లిక్విడ్‌ ఫండ్స్‌తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కనుక అత్యవసర నిధి విషయంలో కాలాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు. 

- ధీరేంద్రకుమార్‌, సీఈవో, రీసెర్చ్‌ వ్యాల్యూ

చదవండి : రేపటి నుంచే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ సౌకర్యాలన్నీ బంద్‌

మరిన్ని వార్తలు