రిస్క్‌ తీసుకోవడం ఇష్టం లేదా, అయితే ఇందులో పెట్టుబడులే సురక్షితం!

11 Apr, 2022 14:03 IST|Sakshi

రిస్క్‌ పెద్దగా ఉండొద్దని కోరుకునే వారికి షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ అనుకూలం. తక్కువ రిస్క్‌ తీసుకునే వారికి, స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసుకోవాలని భావించే వారు షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈ విభాగంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే ఇన్వెస్టర్లు హెచ్‌డీఎఫ్‌సీ షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఈ పథకం భిన్నమైన పెట్టుబడుల విధానంతో, మంచి పనితీరు చూపిస్తోంది. 

రాబడులు 
షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ను ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌తో పోల్చి చూడొచ్చు. ఈ పథకంలో గడిచిన ఏడాది కాలంలో వచ్చిన రాబడి 4 శాతంగా ఉంది. అదే మూడేళ్లు అంతకుమించిన కాలాల్లో చూసినప్పుడు సగటు రాబడి 7 శాతానికి పైన ఉండడాన్ని గమనించాలి. మూడేళ్ల కాలంలో 7.42 శాతం, ఐదేళ్లలో 7.32 శాతం, ఏడేళ్లలో 7.65 శాతం, పదేళ్లలో 8.23 శాతం చొప్పున రాబడులను ఈ పథకం ఇన్వెస్టర్లకు అందించింది. 2010 జూన్‌ లో ఈ పథకం ఆరంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడి రేటు 8.31 శాతంగా ఉండడం గమనార్హం.  

పోర్ట్‌ఫోలియో 
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.14,634 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఎక్స్‌పెన్స్‌ రేషియో 0.74 శాతంగా ఉంది. మొత్తం సెక్యూరిటీలు 146 ఉన్నాయి. సగటు మెచ్యూరిటీ 2.76 సంవత్సరాలుగా ఉంది. అధిక నాణ్యతను సూచించే ఏఏఏ రేటెడ్‌ బాండ్లలో 50 శాతం పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ప్రభుత్వ సెక్యూరిటీల్లో 22.48 శాతం ఇన్వెస్ట్‌ చేసింది. కొంచెం రిస్క్‌ ఉంటే ఏఏ రేటెడ్‌ పత్రాల్లో 15.55 శాతం, ఇంకాస్త అధిక రిస్క్‌ను సూచించే ఏ1ప్లస్‌ పత్రాల్లో 5 శాతం చొప్పున (అధిక రాబడులు) ఇన్వెస్ట్‌ చేసింది. 7.22 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. 

పెట్టుబడుల విధానం 
ఈ పథకానికి అనిల్‌ బంబోలి మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రిస్క్‌ తక్కువగా ఉండే విధంగా పెట్టుబడులు పెట్టడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉంది. ఎక్కువ క్రెడిట్‌ రిస్క్‌ తీసుకోకుండా మంచి రాబడులు ఇచ్చే విధంగా పనిచేస్తుంటారు. డ్యురేషన్‌ బెట్స్‌ (కాలవ్యవధికి సంబంధించి సెక్యూరిటీలు)కాకుండా..మంచి విలువ తెచ్చిపెడతాయనుకున్న సెక్యూరిటీలను ఎంచుకుంటారు. లోతైన పరిశోధన తర్వాతే సెక్యూరిటీల ఎంపిక ఉంటుంది. 

పెట్టుబడులు పెట్టడానికి ముందు ఆయా డెట్‌ పత్రాలను ఇష్యూ చేస్తున్న కంపెనీ యాజమాన్యం, ఆర్థిక మూలాలు, వ్యాపార బలలాను విశ్లేషించిన తర్వాతే పెట్టుబడుల నిర్ణయం ఉంటుంది. ప్రధానంగా ఆయా కంపెనీలు తిరిగి చెల్లింపులు చేయగలుగుతాయా? అన్నది చూస్తారు. కంపెనీల నగదు ప్రవాహాలు (వ్యాపార ఆరోగ్యాన్ని సూచించేది), ఇతర రేషియోలను కూడా ఈ పథకం పరిశోధన బృందం విశ్లేషిస్తుంది. ఇందుకోసం ఈక్విటీ పథకాల పరిశోధన బృందం అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇవన్నీ చూసిన తర్వాతే కంపెనీల డెట్‌ పేపర్ల నాణ్యతపై నిర్ణయానికొస్తారు. భద్రత, ఆయా సెక్యూరిటీల్లో లిక్విడిటీ అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. స్వల్పకాలం నుంచి మధ్యకాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.

మరిన్ని వార్తలు