జెఫ్‌ బేజోస్‌కి ఝలక్‌ ఇచ్చిన ఎలన్‌మస్క్‌!

5 Nov, 2021 10:27 IST|Sakshi

Jeff Bezos Vs Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి రెండో స్థానాల్లో ఉన్న టెస్లా ఎలన్‌మస్క్‌, అమెజాన్‌ జెఫ్‌బేజోస్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. భూమిపై వ్యాపారం విషయంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. తాజాగా అంతరిక్ష ప్రాజెక్టులకు సంబందించిన పనులు దక్కించుకునే విషయంలోనూ వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా వీరిద్దరికి చెందిన స్పేస్‌ఎక్స్‌, బ్లూఆరిజిన్‌ సంస్థల మధ్య వివాదం చెలరేగగా.. చివరకు ఎలన్‌మస్క్‌ పైచేయి సాధించారు.

నాసా ప్రాజెక్ట్‌
నార్త్‌ అమెరికా ‍స్పేస్‌ ఏజెన్సీ (నాసా) చంద్రుడిపై వ్యోమగాము (అస్ట్రోనాట్స్‌)లను పంపే విషయంలో రెగ్యులర్‌గా ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఆర్టెమిస్‌ ప్రాజెక్టులో భాగంగా అస్ట్రోనాట్స్‌ని మరోసారి చంద్రుడి మీదకు పంపాలని నిర్ణయించింది. అందులో భాగంగా అస్ట్రోనాట్స్‌ క్షేమంగా చంద్రుడు, భూమిపై దిగేందుకు వీలుగా లూనార్‌ ల్యాండర్‌ ప్రాజెక్టును చేపట్టింది.

స్పేస్‌ ఎక్స్‌కి పనులు
ఆర్టెమిస్‌ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌లో సాగుతోంది. ఇందులో లూనార్‌ ల్యాండర్‌ను తయారు చేయాల్సిన బాధ్యతలను ఎలన్‌మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థకి నాసా అప్పగించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2.9 బిలియిన్‌ డాలర్లుగా ఉంది.

బ్లూ ఆరిజిన్‌ అభ్యంతరం
టెక్నాలజీ పరంగా అనేక లోపాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా స్పేస్‌ఎక్స్‌ సంస్థకి లూనార్‌ల్యాండర్‌ పనులు కట్టబెట్టారంటూ జెఫ్‌బేజోస్‌కి చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించింది. ముఖ్యంగా మనుషులను ల్యాండింగ్‌ సంబంధించి ఈ ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ కాంట్రాక్టు రద్దు చేయాలని కోరింది. 

ఫెడరల్‌ కోర్టులో
మరోవైపు జెఫ్‌బేజోస్‌కి చెందిన బ్లూ ఆరిజిన్‌ చెబుతున్న అభ్యంతరాలపై త్వరగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని, ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం అవుతుందంటూ నాసా సైతం న్యాయస్థానాన్ని కోరింది. ఇరువైపులా వాదనలు విన్న ఫెడరల్‌ కోర్టు చివరకు బ్లూఆరిజిన్‌ లేవనెత్తిన అభ్యంతరాలను కొట్టి పడేసింది. ఈ ప్రాజెక్టులో ముందుకు వెళ్లవచ్చంటూ నాసాకు అనుమతులు జారీ చేసింది.

ట్వీట్‌వార్‌
ఫెడరల్‌ కోర్టు తీర్పుపై స్పందిస్తూ జెఫ్‌బేజోస్‌ ట్వీట్‌ చేశారు. ఈ తరహా తీర్పును తాము ఊహించలేదని, ఐనప్పటికీ న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామన్నారు. మరోవైపు ఎలన్‌మస్క్‌ కూడా ట్వి‍ట్టర్‌ వేదికగా ఓ మీమ్‌తో స్పందించారు. 

చదవండి: రూటు మార్చిన ఎలన్‌ మస్క్‌.. ఇండియా మార్కెట్‌ కోసం సరికొత్త వ్యూహం

మరిన్ని వార్తలు