బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్

15 Jun, 2021 19:45 IST|Sakshi

బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకి తొలగిన అడ్డంకి 

న్యూఢిల్లీ: పబ్‌జీకి చెందిన త్వరలో లాంచ్ కానున్న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ యాప్ నిషేధం విషయంలో కేంద్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాను భారత్ లో విడుదల కాకముందే తాము నిషేదించలేమని జెఎన్‌యులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ గౌరవ్ త్యాగి అనే విమర్శకుడు ఇటీవల దాఖలు చేసిన ఆర్టీఐకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. ఇన్ఫర్మేషన్స్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఎ నిబంధనల ప్రకారం విడుదల తర్వాత మాత్రమే ఈ ఆటను నిషేదించే అవకాశం ఉంటుంది అని చెప్పింది.

డాక్టర్ గౌరవ్ త్యాగి దాఖలు చేసిన ఆర్టీఐపై స్పందిస్తూ ఐటి మంత్రిత్వ శాఖ.. "భారతదేశంలో పబ్‌జీ లేదా ఏదైనా కంపెనీ/మొబైల్ యాప్ ప్రవేశానికి అనుమతి ఇవ్వడంలో ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఎటువంటి అధికారులు లేవు" అని పేర్కొంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. "హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ యాప్ విడుదలకు అనుమతి ఇవ్వదు. భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, రక్షణ విషయంలో నిబందనలు పాటించకపోతే మాత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఎ, ఐటీ నిబంధనల ప్రకారం ఏదైనా మొబైల్ యాప్ ను నిషేదించే అవకాశం ఉంటుంది" అని తెలిపింది. ఈ గేమ్ ను భారతదేశంలోకి క్రాఫ్టన్ తీసుకొస్తుంది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మే 18 నుంచి ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ నెల 18న గేమ్ విడుదల అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే,  విడుదల విషయంలో అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెల్లడించలేదు.

చదవండి: గుడ్ న్యూస్: టీవీఎస్ అపాచీ బైక్ పై భారీ ఆఫర్

మరిన్ని వార్తలు