కీలక దశకు కోవాగ్జిన్‌ ప్రయోగాలు

23 Dec, 2020 11:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌ సిద్ధం చేస్తున్న కోవిడ్‌–19 నిరోధక టీకా ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి. టీకా వినియోగానికి అత్యవసరమైన మూడో దశ మానవ ప్రయోగాల్లో 13 వేల మందికి టీకాలు ఇవ్వడం పూర్తయినట్లు భారత్‌ బయోటెక్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెలలో మొత్తం 26,000 మందికి టీకాలిచ్చి పరీక్షించే లక్ష్యంతో మూడో దశ ప్రయోగాలు మొదలైన సంగతి తెలిసిందే. తొలి, రెండో దశ మానవ ప్రయోగాలు ఒక్కొక్క దాంట్లో 1,000 మందికి టీకా అందించి భద్రత, రోగ నిరోధక వ్యవస్థ స్పందనలను నిర్ధారించుకున్నామని, ఈ రెండు దశల ప్రయోగాలపై అందిన సమాచారాన్ని అంతర్జాతీయ స్థాయి జర్నల్స్‌లో ప్రచురించామని కంపెనీ వెల్లడించింది.

భారత్‌ బయోటెక్, భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య, పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలు సంయుక్తంగా కోవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌కు చెందిన బయోసేఫ్టీ లెవల్‌–3 కేంద్రాల్లో ఉత్పత్తి చేయనున్నారు. కోవాగ్జిన్‌ ప్రయోగాల్లో పాల్గొన్న 13 వేల మందికి భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: భారత్‌ బయోటెక్‌తో యూఎస్‌ కంపెనీ జత)

Poll
Loading...
మరిన్ని వార్తలు