కోవిడ్‌ వ్యాక్సిన్‌

2 Nov, 2020 06:34 IST|Sakshi

ఏప్రిల్‌–జూన్‌లో: భారత్‌ బయో

న్యూఢిల్లీ: అనుమతులు వస్తే కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య విడుదల చేయాలని భావిస్తున్నట్టు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో మూడవ దశ ఔషధ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేయడంపైనే ప్రస్తుతం దృష్టిసారించామని కంపెనీ ఇంటర్నేషనల్‌ ఈడీ సాయి ప్రసాద్‌ తెలిపారు. మూడవ దశ ప్రయోగాలకు సంబంధించిన బలమైన ప్రయోగాత్మక సాక్ష్యాల ఏర్పాటు, సమాచారం, సామర్థ్యం, భద్రతా సమాచారం ఆధారంగా భారత నియంత్రణ సంస్థల నుంచి అన్ని అనుమతులు లభిస్తే 2021 రెండవ త్రైమాసికంలో వ్యాక్సిన్‌ విడుదల చేస్తామన్నారు.

కాగా, ప్రస్తుత నెలలోనే ఫేజ్‌–3 ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. ఇందుకు డీసీజీఐ నుంచి కంపెనీ అనుమతులను పొందింది. 14 రాష్ట్రాల్లో 25–30 కేంద్రాల్లో ఔషధ ప్రయోగాలు జరగనున్నాయని సాయి ప్రసాద్‌ చెప్పారు. ఇందుకోసం ఒక్కో ఆసుపత్రిలో సుమారు 2,000 మంది వాలంటీర్లను నియమించుకుంటామని చెప్పారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, కొత్త తయారీ కేంద్రాలు, మూడవ దశ ఔషధ ప్రయోగాలకు సుమారు రూ.350–400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలకూ ఈ వ్యాక్సిన్‌ను విక్రయిస్తామన్నారు. వ్యాక్సిన్‌ ఎగుమతికై పలు దేశాలతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని వివరించారు. ధర ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశారు.    

మరిన్ని వార్తలు