భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ హవా: రెండేళ్లలో అనూహ్య వృద్ధి  

21 Oct, 2022 13:02 IST|Sakshi

రెండున్నరేళ్లలోనే  రూ.50,000 కోట్లు

న్యూఢిల్లీ: భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ల పరిధిలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రెండున్నరేళ్లలోనే రికార్డు స్థాయికి చేరాయి. రూ.50,000 కోట్ల మార్క్‌ను అధిగమించాయి. వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎడెల్‌వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ వివరాలను ప్రకటించింది. 2019 డిసెంబర్‌లో భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ మొదటి విడత ఇష్యూ రావడం గమనార్హం. అప్పటి నుంచి ఐదు ఇష్యూలు పూర్తయ్యాయి. వీటి మెచ్యూరిటీ 2023, 2025, 2030, 2031, 2031లో తీరనుంది.

‘‘ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక బలం, ఇన్వెస్టర్లలో వాటి పట్ల ఉన్న విశ్వాసానికి భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ల విజయం నిదర్శనం. మన తొలి డెట్‌ ఈటీఎఫ్‌ అద్భుత విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉంది’’అని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు. ఏఏఏ రెటెడ్‌ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీలతో కూడిన నిఫ్టీ భారత్‌ బాండ్‌ సూచీల్లో భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లు ఇన్వెస్ట్‌ చేస్తాయి. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ల ఘన విజయంతో ఇతర అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు 2019 తర్వాత సుమారు 30 వరకు టార్గెట్‌ మెచ్యూరిటీ ఫండ్స్‌ను తీసుకు రావడం గమనార్హం. ప్యాసివ్‌ డెట్‌ విభాగంలో రూ.60వేల కోట్ల ఏయూఎంతో ఎడెల్‌వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అగ్రగామిగా చేరుకోవడానికి భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లు దోహదపడ్డాయి.  

మరిన్ని వార్తలు