భారత్‌ డైనమిక్స్‌ బోర్లా- అశోకా బిల్డ్‌కాన్‌ భేష్‌

8 Sep, 2020 10:39 IST|Sakshi

నేటి నుంచి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ప్రారంభం

13 శాతం కుప్పకూలిన భారత్‌ డైనమిక్స్‌

తాజాగా జాతీయ రహదారుల కాంట్రాక్టులు

7 శాతం జంప్‌చేసిన అశోకా బిల్డ్‌కాన్‌ షేరు

సరిహద్దు వద్ద చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. కాగా.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి తాజాగా కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు వెల్లడికావడంతో మౌలిక సదుపాయాల కంపెనీ అశోకా బిల్డ్‌కాన్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా వాటా విక్రయాన్ని చేపట్టడంతో పీఎస్‌యూ.. భారత్‌ డైనమిక్స్‌ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి అశోకా బిల్డ్‌కాన్‌ కౌంటర్‌  భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. భారత్‌ డైనమిక్స్‌(బీడీఎల్‌)‌ కౌంటర్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..

అశోకా బిల్డ్‌కాన్‌
బీహార్‌లో రహదారుల అభివృద్ధి కోసం ఎన్‌హెచ్‌ఏఐ నుంచి రెండు ప్రాజెక్టులు సొంతం చేసుకున్నట్లు అశోకా బిల్డ్‌కాన్‌ తాజాగా వెల్లడించింది. వీటి విలువ రూ. 1,390 కోట్లుకాగా.. ప్యాకేజీ-1లో భాగంగా అరా- పరారియా సెక్షన్‌లో నాలుగు లైన్ల రహదారిని ఏర్పాటు చేయవలసి ఉంటుందని తెలియజేసింది. ప్యాకేజీ-2 కింద పరారియా- మోహనియా మధ్య సైతం నాలుగు లైన్ల రహదారిని అభివృద్ధి చేయవలసి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అశోకా బిల్డ్‌కాన్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 73 వద్ద ట్రేడవుతోంది.

భారత్‌ డైనమిక్స్‌
రక్షణ రంగ పరికరాల తయారీ కంపెనీ భారత్‌ డైనమిక్స్‌లో కేంద్ర ప్రభుత్వం 15 శాతం వాటాను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా విక్రయానికి ఉంచింది. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ఈ ఆఫర్‌ నేడు ప్రారంభమైంది. ఇందుకు ఫ్లోర్‌ ధర రూ. 330. సోమవారం ముగింపుతో పోలిస్తే ఇది 14 శాతం డిస్కౌంట్‌కావడం గమనార్హం! ఆఫర్‌లో భాగంగా ప్రభుత్వం 2.71 కోట్ల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 87.75 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ డైనమిక్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 13 శాతం పతనమై రూ. 335 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 332 వరకూ జారింది. ఈ షేరు మార్చి 24న రూ. 147 వద్ద కనిష్టాన్ని తాకగా.. గత నెల 14న రూ. 481 వద్ద సరికొత్త గరిష్టానికి చేరింది.

మరిన్ని వార్తలు