భారత్‌ ఫోర్జ్‌- అశోక్‌ లేలాండ్‌.. యమస్పీడ్‌‌ 

13 Aug, 2020 13:24 IST|Sakshi

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

11 శాతం దూసుకెళ్లిన భారత్‌ ఫోర్జ్‌

11 శాతం జంప్‌చేసిన అశోక్‌ లేలాండ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర  ఫలితాలు ప్రకటించినప్పటికీ ఆటో విడిభాగాల దిగ్గజం భారత్‌ ఫోర్జ్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ నెలకొంది. మరోపక్క ఇదే కాలంలో రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించినప్పటికీ ఆటో రంగ దిగ్గజం అశోక్‌ లేలాండ్ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కోవిడ్‌-19 కట్టడికి లాక్‌డవుల అమలు కారణంగా పనితీరు నిరాశపరచినప్పటికీ భవిష్యత్‌లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం..

భారత్‌ ఫోర్జ్‌ 
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో భారత్‌ ఫోర్జ్‌ రూ. 127 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 172 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 2373 కోట్ల నుంచి రూ. 1199 కోట్లకు బలహీనపడింది. ఇటీవల దేశ, విదేశీ మార్కెట్లలో స్వల్ప రికవరీ పరిస్థితులు కనిపిస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో భారత్‌ ఫోర్జ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ. 482 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 490 వరకూ ఎగసింది.

అశోక్‌ లేలాండ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో అశోక్‌ లేలాండ్‌ రూ. 389 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 275 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 6588 కోట్ల నుంచి రూ. 1486 కోట్లకు భారీగా క్షీణించింది. అయితే ఇటీవల డిమాండ్‌ బలపడుతున్నదని, దీంతో క్యూ2, క్యూ3లో అమ్మకాలు పెరిగే వీలున్నదని కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో అశోక్‌ లేలాండ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 11 శాతం జంప్‌చేసి రూ. 60 వద్ద ట్రేడవుతోంది. 

మరిన్ని వార్తలు