-

భారత్‌ ఫోర్జ్‌ లాభంలో క్షీణత

15 Nov, 2022 08:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల దిగ్గజం భారత్‌ ఫోర్జ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో 48 శాతం క్షీణించి రూ.141 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 270 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,386 కోట్ల నుంచి రూ. 3,076 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 1.50 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది.

అల్యూమినియం ఫోర్జింగ్‌ బిజినెస్‌ విక్రయాలు మందగించడంతో యూరోపియన్‌ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు భారత్‌ ఫోర్జ్‌ పేర్కొంది. ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్లాంటులో ఉత్పత్తిని దశలవారీగా హెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం నిర్వహణా లాభస్థాయికి దిగువనే వినియోగమున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో అల్యూమినియం ఫోర్జింగ్‌ బిజినెస్‌ టర్న్‌అరౌండ్‌ సాధించే వీలున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ బీఎన్‌ కళ్యాణి అభిప్రాయపడ్డారు. ఫలితాల నేపథ్యంలో భారత్‌ ఫోర్జ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం క్షీణించి రూ. 853 వద్ద ముగిసింది.

చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్‌: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా!

మరిన్ని వార్తలు