రైలు ద్వారా బల్క్‌ సిమెంట్‌ సరఫరా

23 Apr, 2022 03:30 IST|Sakshi
రైల్వే కంటైనర్ల ద్వారా భారతి సిమెంట్‌ సరఫరా. కార్యక్రమంలో మాట్లాడుతున్న అనూప్‌ కుమార్‌ సక్సేనా

దేశంలో తొలిసారిగా ప్రారంభం

శ్రీకారం చుట్టిన భారతి సిమెంట్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంట్‌ సరఫరాలో సరికొత్త అధ్యాయానికి భారతి సిమెంట్, కాంకర్‌ గ్రూప్‌ నాంది పలికాయి. భారత్‌లో తొలిసారిగా రైలు ద్వారా బల్క్‌ సిమెంట్‌ సరఫరాను ప్రా రంభించాయి. ఇందుకోసం కాంకర్‌ గ్రూప్‌ రూపొం దించిన 20 అడుగుల కస్టమైజ్డ్‌ ట్యాంక్‌ కంటైనర్స్, లైనర్స్‌తో కూడిన బాక్స్‌ కంటైనర్స్‌ను కంపెనీ వినియోగించింది. వికా గ్రూప్‌ జాయింట్‌ వెంచర్‌ అయిన భారతి సిమెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఎర్రగుంట్ల వద్ద ప్లాంటు ఉంది.

ఈ కేంద్రం నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బల్క్‌ సిమెంట్‌తో కూడిన రైలు శుక్రవారం ప్రారంభమైంది. ప్రధాన మార్కెట్లు అయిన చెన్నై, నైరుతీ తమిళనాడు, కేరళకు ఈ విధానంలో సిమెంట్‌ సరఫరా చేయనున్నట్టు భారత్‌లో వికా గ్రూప్‌ సీఈవో అనూప్‌ కుమార్‌ సక్సేనా తెలిపారు. కోయంబత్తూరులో ప్రత్యేక ప్యాకేజింగ్‌ టెర్మినల్‌ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కంటైనర్లు, అత్యాధునిక టెర్మినల్‌ కోసం రూ.130 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు.  

నూతన అధ్యాయం..
రైలు ద్వారా బల్క్‌ సిమెంట్‌ సరఫరాతో రవాణా ఖర్చులు, కర్బన ఉద్గారాలు తగ్గుతాయని సక్సేనా తెలిపారు. ‘కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించే వీలు అవుతుంది. భారతి సిమెంట్‌ మొదటిసారిగా స్వీకరించిన ఈ మోడల్‌ దేశంలో సిమెంట్‌ రవాణాలో విప్తవాత్మక మార్పులతోపాటు నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది’ అని వివరించారు. ఎర్రగుంట్ల ప్లాంటు నుంచి తొలి రైలును జెండా ఊపి సక్సేనా ప్రారంభించారు.

కార్యక్రమంలో భారతి సిమెంట్‌ డైరెక్టర్లు ఎం.రవీందర్‌ రెడ్డి, జి.బాలాజీ, జె.జె.రెడ్డి, హరీష్‌ కామర్తి, ఎరిక్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ ఆర్‌.ధనుంజయులు, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జాన్‌ ప్రసాద్, కాంకర్‌ ఈడీ శేషగిరి రావు పాల్గొన్నారు. రైల్వే బోర్డ్‌ మెంబర్‌ ఆపరేషన్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ సంజయ్‌ మహంతి, కాంకర్‌ ఎండీ వి.కళ్యాణ రామ న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాలుపంచుకున్నారు.  

వేగంగా సిమెంట్‌ రవాణా ..
ప్రత్యేక కంటైనర్లలో బల్క్‌ సిమెంట్‌ రవాణా వల్ల తయారీ కంపెనీలతోపాటు తమ సంస్థకు మేలు చేకూరుస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జ్‌ జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటంతోపాటు వేగంగా సిమెంట్‌ రవాణా సాధ్యపడుతుందని అన్నారు.   
 

మరిన్ని వార్తలు