భారత్‌ మాల @ రూ.10.63 లక్షల కోట్లు

19 Jul, 2022 06:16 IST|Sakshi

ప్రాజెక్టు వ్యయం రెట్టింపు

23 శాతమే ఇప్పటికి పూర్తి

2028 నాటికి పూర్తి కావచ్చని అంచనా

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదిక

ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌మాలా (జాతీయ రహదారుల విస్తరణ) ప్రాజెక్టు తీవ్ర జాప్యాన్ని చూస్తోంది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 23 శాతం పనులే కాగా, 2028 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తవుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. వాస్తవానికి 2022 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావించగా సాధ్యపడలేదు.

ఆరేళ్లు ఆలస్యంగా, అది కూడా ముందు అంచనాలకు రెట్టింపు వెచ్చిస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాదని ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. అది కూడా ప్రస్తుత ధరల ప్రకారమే వ్యయాలు రెట్టింపు అవుతాయన్నది అంచనా. భూముల ధరలు, ఇన్‌పుట్‌ వ్యయాలను కూడా కలిపి చూస్తే ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి మరో 15–20 శాతం మేర వ్యయాలు పెరిగిపోవచ్చని ఇక్రా తన నివేదికలో తెలిపింది. భూ సమీకరణ పెద్ద సమస్యగా మారిందని పేర్కొంది.  

ప్రాజెక్టులో 60 శాతానికే అవార్డ్‌
భారత్‌మాలా ప్రాజెక్ట్‌ మొత్తం విస్తీర్ణం 34,800 కిలోమీటర్లు కాగా, ఇందులో 60 శాతానికే అంటే 20,632 కోట్ల మేర రహదారుల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఆర్డర్లు (2021 డిసెంబర్‌ నాటికి) ఇచ్చింది. భూ సమీకరణలో సమస్యలు, భూముల కొనుగోలు వ్యయాలు గణనీయంగా పెరిగిపోవడం, కరోనా మహమ్మారిని ప్రాజెక్టు జాప్యానికి కారణాలుగా ఇక్రా తెలియజేసింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అదనపు రుణాల సమీకరణను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.

రహదారుల నిర్మాణానికి క్యాపిటల్‌ మార్కెట్లను ఆశ్రయిస్తామని, చిన్న ఇన్వెస్టర్లకు 8 శాతం వడ్డీని ఆఫర్‌ చేసి తగినన్ని నిధులను సమీకరిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ గతవారమే ప్రకటించడం గమనార్హం. భారత్‌మాలా కింద పూర్తి విస్తీర్ణం మేరకు రహదారుల నిర్మాణ అవార్డులను జారీ చేయడం 2024 మార్చి నాటికి పూర్తవుతుందని ఇక్రా అంచాన వేస్తోంది. ఎన్నికల కారణంగా జాప్యం చోటు చేసుకుంటే ఇది 2025 మార్చి వరకు పట్టొచ్చని తెలిపింది. ఏటా 4,500–5,000 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగితే 2028 మార్చి నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు