అనూహ్య పరిణామం.. భారత్‌పే ఎండీ రాజీనామా! కుట్రే గెలిచిందంటూ భావోద్వేగం

1 Mar, 2022 11:07 IST|Sakshi

ఫిన్‌టెక్‌ కంపెనీ భారత్‌పేలో పరిణామాలు అనూహ్య మలుపు తిరిగాయి.  భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, ఎండీ అష్నీర్‌ గ్రోవర్‌ కంపెనీకి, బోర్డుకు రాజీనామా చేసినట్లు సమాచారం. అన్నీ తనకు వ్యతిరేకంగా జరుగుతుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


భారత్‌ పే ఎండీ అష్నీర్‌ గ్రోవర్‌, ఆయన భార్య మాధురీ జైన్‌లపై గత కొంతకాలంగా వృత్తిపరమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అంతర్గత దర్యాప్తునకు కాకుండా.. ప్రైవేట్‌ ఏజెన్సీలతో దర్యాప్తు చేయిస్తోంది భారత్‌పే. ఈ క్రమంలో..  ఈమధ్యే అష్నీర్‌ భార్య, కంపెనీ మాధురీ జైన్‌ను కంపెనీ తప్పించిన విషయం తెలిసిందే. కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు జల్సాలు చేసిందన్న ఆరోపణలను నిజమని తేల్చింది అల్వరెజ్‌ అండ్‌ మార్షల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ. దీంతో ఆమెను కీలక బాధ్యతల నుంచి తప్పిస్తూ, ఆమె వాటాను సైతం రద్దు చేసేసింది BharatPe. ఇది జరిగిన వారంకే అష్నీర్‌ తన పదవికి రాజీనామా చేస్తూ కంపెనీని వీడడం విశేషం. 

తనపై వస్తున్న ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్న అష్నీర్‌ గ్రోవర్‌.. భార్యను తొలగించిన తర్వాత కూడా ఆ ఆరోపణలను తీవ్రస్థాయిలోనే ఖండించాడు. మరోవైపు అష్నీర్‌ ఆరోపణలను దర్యాప్తు చేయడానికి బయటి ఏజెన్సీలను నియమించడంపై కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. అయితే.. ఒకదాని వెంట ఒకటి ఆయనకు వ్యతిరేక నిర్ణయాలు వస్తుండడంతో.. చివరిగా మధ్యవర్తిత్వం కోసం ఆయన ప్రయత్నించారు. కానీ, కంపెనీ అందుకు సైతం అంగీకరించలేదు.  ఈ పరిణామాలతో కలత చెంది కంపెనీ వీడుతున్నట్లు సమాచారం.

‘‘భారత్‌పే కంపెనీని మొదలుపెట్టిన వాళ్లలో ఒకరైన నేను..  ఈరోజు బలవంతంగా కంపెనీని వీడాల్సి వస్తోంది. అందుకే బరువెక్కిన గుండెతో ఈ సందేశం రాస్తున్నా.  ఫిన్‌టెక్ కంపెనీ ప్రపంచంలో భారత్‌పే అగ్రగామిగా నిలిచిందని తల ఎత్తుకుని గర్వంగా చెప్పగలను. దురదృష్టం కొద్దీ 2022 ప్రారంభం నుంచి.. నా ప్రతిష్టకు భంగం కలిగించే ఆరోపణలు వస్తున్నాయి. కంపెనీని విచ్ఛిన్నం చేయాలని భావిస్తున్న కొందరే  నాపై, నా కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ల ఆరోపణల్లోనే నేను చిక్కుకున్నాను. చివరకు కుట్రే గెలిచింది. ఒకప్పుడు కంపెనీ ముఖచిత్రంగా నిలిచిన వ్యక్తి.. ఇప్పుడు కుట్రలో పావుగా బలవుతున్నాడు. దురదృష్టవశాత్తూ కంపెనీ తన ఉనికిని కోల్పోయింది’’ అంటూ సుదీర్ఘమైన లేఖ రాశాడు అష్నీర్‌ గ్రోవర్‌. 

వరుస పరిణామాలు.. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ విఫలమైందని అష్నీర్‌ గ్రోవర్‌ ఆరోపించాడు. ఆపై 500 కోట్ల రూపాయలకు కొటక్‌ మహీంద్రా మీద దావా వేశారు. ఆపై కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఉద్యోగిని ఫోన్‌కాల్‌లో దుర్భాషలాడుతూ.. అష్నీర్‌ గ్రోవర్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక క్లిప్‌ వైరల్‌ అయ్యింది.  ఈ వ్యవహారంలో న్యాయపరమైన చర్యలకు దిగిన కొటాక్‌ మహీంద్రా, భారత్‌పే ఎండీకి నోటీసులు సైతం పంపింది. దీంతో కంపెనీ అష్నీర్‌ను, ఆయన భార్య మాధురీని హడావిడిగా సెలవుల మీద బయటికి పంపించి.. సీఈవో సుహాయిల్‌ సమీర్‌కు తాత్కాలిక ఎండీ బాధ్యతలు అప్పజెప్పింది.  అదే టైంలో వీళ్లు అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారంటూ ప్రైవేట్‌ ఏజెన్సీలకు​ దర్యాప్తు అప్పజెప్పింది. తనను కావాలనే టార్గెట్‌ చేశారంటూ ఆరోపించిన అష్నీర్‌.. ఒకానొక టైంలో తన వాటా తనకు ఇస్తే వెళ్లిపోతానంటూ స్పష్టం చేశాడు కూడా.

ఇదిలా ఉండగా.. సుమారు 3 బిలియన్‌ డాలర్ల విలువ ఉన్న భారత్‌పే కంపెనీ.. మరో 18 నెలల్లో ఐపీవోకు వెళ్లే యోచనలో ఉంది. ఈ లోపు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది.

మరిన్ని వార్తలు