గ్రోవర్‌కు భారత్‌పే షాక్‌

3 Mar, 2022 03:48 IST|Sakshi
అష్నీర్‌ గ్రోవర్‌

అన్ని పొజిషన్ల నుంచి పేరు తొలగింపు

చట్టపరమైన చర్యలు తీసుకునే చాన్స్‌

న్యూఢిల్లీ: అక్రమాలకు పాల్పడిన ఆరోపణలతో కంపెనీలో సహవ్యవస్థాపకుడిగా ఉన్న అష్నీర్‌ గ్రోవర్‌కు భారత్‌పే తాజాగా షాకిచ్చింది. అన్ని పొజిషన్ల నుంచీ గ్రోవర్‌ పేరును తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు సైతం తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో గ్రోవర్‌కున్న వాటాలపైనే ఆంక్షలు విధించనుంది. రానున్న బోర్డు సమావేశంలో చేపట్టనున్న అంశాల వివరాలు అందుకున్న గ్రోవర్‌ రాజీనామా చేసినట్లు భారత్‌పే వెల్లడించింది.

కంపెనీలో గ్రోవర్‌ కార్యకలాపాలపై స్వతంత్ర ఆడిట్‌ నివేదికను బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టనున్న అంశాన్ని సైతం గ్రోవర్‌కు తెలియజేసినట్లు పేర్కొంది. ముందురోజు సాయంత్రం నిర్వహించిన సమావేశం అర్ధరాత్రి వరకూ కొనసాగినట్లు వెల్లడించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే హక్కులను కంపెనీ రిజర్వ్‌ చేసుకున్నట్లు తెలియజేసింది. క్యూఆర్‌ కోడ్స్‌ ద్వారా వివిధ షాప్‌ యజమానులు డిజిటల్‌ చెల్లింపులను చేపట్టేందుకు భారత్‌పే వీలు కల్పించే సంగతి తెలిసిందే.

ఆహ్వానం ఇలా
బుధవారం(2న) రాత్రి 7.30కు చేపట్టనున్న బోర్డు మీటింగుకు హాజరుకావల్సిందిగా గ్రోవర్‌కు మంగళవారం ఈమెయిల్‌ అందడంతో 12.05కు రాజీనామా చేసినట్లు భారత్‌పే పేర్కొంది. గ్రోవర్‌ కుటుంబం, అతని కుటుంబ సభ్యులు కంపెనీ నిధులను దుర్వినియోగం చేయడంతోపాటు.. నకిలీ వెండార్స్‌ సృష్టి ద్వారా కంపెనీ ఖాతాల నుంచి సొమ్మును దారిమళ్లించినట్లు ఆరోపించింది. తద్వారా ధనాన్ని ఆర్జించడమేకాకుండా, విలాసవంత జీవనవిధానాలకు సొమ్మును వినియోగించినట్లు ఆరోపణల్లో తెలియజేసింది. కంపెనీ ఎండీ, బోర్డు డైరెక్టర్‌ పదవులకు రాజీనామా చేయడంతో గ్రోవర్‌ ఉద్యోగ బాధ్యతలను రద్దు చేసేందుకు భారత్‌పే నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు