బంపర్ ఆఫర్.. కొత్త ఉద్యోగులకు బిఎమ్‌డబ్ల్యూ బైక్స్, ఆపిల్ ఐప్యాడ్స్

29 Jul, 2021 19:03 IST|Sakshi

దేశంలోని కంపెనీలు వారి వ్యాపారాన్ని విస్తరించడం కోసం కొత్త కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. అధిక జీతంతో పాటు ఉద్యోగులకు వివిధ ప్రయోజనాలు కూడా అందిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు టెక్ కంపెనీలు మంచి ప్రతిభ కనబరిచిన పాత ఉద్యోగులకు బోనస్, స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తుంటాయి. కానీ, ఒక టెక్ కంపెనీ మాత్రం విచిత్రంగా కొత్తగా ఉద్యోగంలో చేరేబోయే వారికి కూడా విలువైన బహుమతులను అందిస్తుంది. భారత్ పే ఫిన్‌టెక్ సంస్థ "టెకీల"ను ఆకర్షించడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. స్టార్టప్ ఉద్యోగాలు చేపట్టాలని చూస్తున్న ఉద్యోగులకు జాయినింగ్ అండ్ రిఫెరల్ ప్రోత్సాహకాలను అందిస్తోంది. 

భారత్ పే "బైక్ ప్యాకేజీ" ప్రణాళికలో భాగంగా అనేక రకాల ప్రీమియం బైక్‌లను అందిస్తోంది. అంతేగాకుండా బైక్‌లను ఇష్టపడని వారికి టెక్నాలజి పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం "గాడ్జెట్ ప్యాకేజీ" పథకం కూడా ఉంది. ఉద్యోగంలో చేరిన ఉద్యోగి ఏదైనా ప్యాకేజీని ఎంచుకోవచ్చు. భారత్ పే వ్యవస్థాపకుడు సీఈఓ అష్నీర్ గ్రోవర్ లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. "ఇది నిజం, ఇక్కడ ఉంది, ఇది మీ కోసమే. టెక్ బృందంలో చేరిన మా కొత్త జాయినర్‌లకు మొదటి బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లు బయలుదేరుతున్నాయి. అలాగే, మేము ఇప్పుడు బైక్ & గాడ్జెట్‌ ప్యాకేజీని ప్రొడక్ట్ మేనేజర్స్ కోసం విస్తరించామని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది" అని పోస్టు చేశారు.

భారత్ పే తన రెఫరల్ & జాయినింగ్ పాలసీలో భాగంగా ఈ ఆఫర్స్ ప్రకటించింది. వంద మంది కొత్త జాయినీల కోసం బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లు, జావా పెరాక్, కెటిఎం డ్యూక్ 390, ఎయిర్‌పాడ్స్, శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్, ఇతర అనేక ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే సంస్థలో ఉన్న ఉద్యోగులుసంతోషంగా ఉన్నారని కంపెనీ నిర్ధారించింది. టెక్ బృందంలో కొత్తగా చేరిన వారికి సంస్థ రెండు వేర్వేరు ప్యాకేజీలను అందిస్తోంది. అలాగే, ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజర్స్ కోసం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. రెండు బృందాలలో కొత్తగా చేరిన వారందరికీ బైక్ ప్యాకేజీ లేదా గాడ్జెట్ ప్యాకేజీలో ఏదైనా ఎంచుకునే అవకాశం ఉంటుంది.

ఉచితంగా ఐసీసీ టి20 మ్యాచ్ 
బైక్ ప్యాకేజీలో 5 సూపర్ బైక్‌లు ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జావా పెరాక్, కెటిఎం డ్యూక్ 390, కెటిఎం ఆర్‌సి 390, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్. గాడ్జెట్ ప్యాకేజీలో ఆపిల్ ఐప్యాడ్ ప్రో(పెన్సిల్‌తో), బోస్ హెడ్‌ఫోన్, హర్మాన్ కార్డాన్ స్పీకర్, శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్, డబ్ల్యూఎఫ్‌హెచ్ డెస్క్ & కుర్చీ, ఫైర్‌ఫాక్స్ టైఫూన్ 27.5 డీ సైకిల్ ఉన్నాయి. ఐసీసీ పురుషుల టి20 ప్రపంచ కప్ కోసం భారతదేశ మొత్తం టెక్ టీంకి దుబాయ్‌లో అక్టోబర్ 17 నుండి 2021 నవంబర్ 14 వరకు ఆతిథ్యం ఇవ్వనుంది. టెక్ టీం సభ్యులకు ఐసీసీ పురుషుల టి20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు చూసే అవకాశం లభిస్తుంది.

మరిన్ని వార్తలు