డిజిటల్‌పై ఎయిర్‌టెల్‌ దృష్టి

15 Apr, 2021 05:20 IST|Sakshi

కార్పొరేట్‌ స్వరూపంలో మార్పులు

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌కి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌ బాటలోనే డిజిటల్‌ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా కార్పొరేట్‌ స్వరూపాన్ని పునర్‌వ్యవస్థీకరించింది. డిజిటల్, ఇండియా, ఇంటర్నేషనల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అంటూ నాలుగు ప్రధాన విభాగాలపై దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ వివరించింది. కొత్త మార్పుల ప్రకారం ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ లిమిటెడ్‌ ఇకపై లిస్టెడ్‌ సంస్థ భారతి ఎయిర్‌టెల్‌లో భాగంగా ఉంటుంది. వింక్‌ మ్యూజిక్, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ స్ట్రీమ్, మిత్రా పేమమెంట్స్‌ ప్లాట్‌ఫాం మొదలైన వాటితో పాటు భవిష్యత్‌లో ప్రవేశపెట్టే డిజిటల్‌ ఉత్పత్తులు, సర్వీసులు కూడా దీని కిందే ఉంటాయి.  

ఇక టెలికం వ్యాపార కార్యకలాపాలన్నీ కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌ సంస్థ పరిధిలో ఉంటాయి. డీటీహెచ్‌ సేవలకు సంబంధించిన భారతి టెలీమీడియా ప్రస్తుతానికి విడిగానే ఉంటుందని, ఈ వ్యాపారాన్ని అంతిమంగా ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌లోకి చేర్చే ఉద్దేశం ఉందని కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ .. భారతి ఎయిర్‌టెల్‌లోనే ప్రత్యేక సంస్థగా కొనసాగుతుంది. మరోవైపు ఎన్‌ఎక్స్‌ట్రా, ఇండస్‌ టవర్స్‌ వంటి ఇన్‌ఫ్రా వ్యాపార సంస్థలు ప్రస్తుతానికి వేర్వేరు సంస్థలుగానే కొనసాగుతాయి. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వాటాదారులకు అధిక ప్రయోజనాలు చేకూర్చేందుకు ఈ మార్పులన్నీ దోహదపడగలవని భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ తెలిపారు. ఎయిర్‌టెల్‌ పోటీ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ గతేడాది ఏకంగా రూ. 1,52,056 కోట్ల పెట్టుబడులు సమీకరించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు