ఎయిర్‌టెల్‌ టర్న్‌అరౌండ్‌

18 May, 2021 11:34 IST|Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 759 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 5,237 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 12% పుంజుకుని రూ. 25,747 కోట్లను తాకింది. దేశీయంగా ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 18,338 కోట్లకు చేరింది. దీనిలో మొబైల్‌ సేవల ఆదాయం 9% బలపడి రూ. 14,080 కోట్లయ్యింది.  ఆఫ్రికా ఆదాయం 17 శాతం ఎగసి రూ. 7,602 కోట్లకు చేరువైంది. వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) 5.8% నీరసించి రూ. 145కు పరిమితమైంది.   

వ్యయాలు తగ్గినా.. 
క్యూ4లో పెట్టుబడుల వ్యయం సగానికి తగ్గి రూ. 3,739 కోట్లకు పరిమితమైంది. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పరిస్థితుల కారణంగా డేటాకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఫిక్స్‌డ్‌ లైన్లుసహా బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ల కోసం అధిక పెట్టుబడులు వెచ్చించవలసి వచ్చినట్లు ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. వెరసి హోమ్‌ సర్వీసులపై మూడు రెట్లు అధికంగా రూ. 332 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసింది. ఎక్స్‌ట్రీమ్‌ పేరుతో విడుదల చేసిన ఇంటర్నెట్‌ కనెక్షన్‌ల ద్వారా కొత్తగా 2.74 లక్షల మంది జత కలిశారు. దీంతో ఈ విభాగంలో కస్టమర్ల సంఖ్య 30.7 లక్షలకు చేరింది. ఎల్‌సీవో భాగస్వామ్యం ద్వారా నాన్‌వైర్‌డ్‌ పట్టణాలలోనూ సేవలు విస్తరిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ వివరించింది. 

పూర్తి ఏడాదికి 
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం భారీగా తగ్గి రూ. 15,084 కోట్లకు పరిమితమైంది. 2019–20లో రూ. 32,183 కోట్ల నికర నష్టం నమోదైంది. ఈ కాలంలో టర్నోవర్‌ తొలిసారి రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించి రూ. 1,00,616 కోట్లను తాకింది.  అంతక్రితం ఏడాది రూ. 84,676 కోట్ల ఆదాయం సాధించింది. ప్రస్తుతం దేశీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 72,308 కోట్లను అధిగమించింది. ఆఫ్రికా బిజినెస్‌ సైతం 19 శాతం పుంజుకుని రూ. 28,863 కోట్లను తాకింది. గ్లోబల్‌ కస్టమర్ల సంఖ్య 47 కోట్లుకాగా.. దేశీయంగా కస్టమర్లు 13 శాతం పెరిగి 35 కోట్లకు చేరారు. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రుణ భారం రూ. 1,48,508 కోట్లుగా నమోదైంది. 

కోవిడ్‌–19 సవాళ్లలో అవసరమైన డిజిటల్‌ ఆక్సిజన్‌ వంటి  సర్వీసులను అందిస్తున్నాం. ఇలాంటి కష్టకాలంలోనూ కస్టమర్లకు పటిష్ట నెట్‌వర్క్‌ను అందించేందుకు తోడ్పడుతున్న సిబ్బందిని ప్రశంసిస్తున్నాను. వెరసి మరోసారి ప్రోత్సాహకర ఫలితాలు సాధించగలిగాం. క్యూ4లో ఎంటర్‌ప్రైజ్‌ విభాగం రెండంకెల వృద్ధిని సాధించింది. – ఎయిర్‌టెల్‌ ఇండియా, దక్షిణాసియా విభాగం ఎండీ, సీఈవో గోపాల్‌ విఠల్‌  
ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.3 శాతం నష్టంతో రూ. 548 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 564–546 మధ్య ఊగిసలాడింది.

మరిన్ని వార్తలు