ఎయిర్‌టెల్‌ టర్న్‌అరౌండ్‌

3 Nov, 2021 06:45 IST|Sakshi

క్యూ2లో రూ. 1,134 కోట్ల లాభం

48 కోట్లకు మొత్తం కస్టమర్ల సంఖ్య

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో రూ. 1,134 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 763 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మెరుగుపడ్డ బిజినెస్‌ వాతావరణం, 4జీ కస్టమర్లలో వృద్ధి, బలపడిన మొబైల్‌ ఏఆర్‌పీయూ వంటి అంశాలు పటిష్ట ఫలితాల సాధనకు సహకరించాయి. క్యూ2లో మొత్తం ఆదాయం 19% పుంజుకుని రూ. 28,326 కోట్లను అధిగమించింది. పెట్టుబడి వ్యయాలు రూ. 6,972 కోట్లుగా నమోదయ్యాయి.  

16 దేశాలలో
ఎయిర్‌టెల్‌ 16 దేశాలలో కార్యకలాపాలు విస్తరించింది. కస్టమర్ల సంఖ్య 48 కోట్లకు చేరింది. టెలికం రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలో భాగంగా ఏజీఆర్‌ బకాయిలు, స్పెక్ట్రమ్‌ చెల్లింపులకు ఎయిర్‌టెల్‌కు నాలుగేళ్ల గడువు లభించింది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్, డేటా సెంటర్లు, డిజిటల్‌ సర్వీసుల ఆదాయం పుంజుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. క్యూ2లో దేశీ ఆదాయం 18 శాతంపైగా వృద్ధితో రూ. 20,987 కోట్లను తాకింది. కస్టమర్ల సంఖ్య 35.5 కోట్లకు చేరింది. ఒక్కో కస్టమర్‌పై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 10 బలపడి రూ. 153కు చేరింది. 4జీ వినియోగదారుల సంఖ్య 26 శాతం ఎగసి 19.25 కోట్లను తాకింది. ఒక్కో యూజర్‌ సగటు నెల రోజుల డేటా వినియోగం 18.6 జీబీగా నమోదైంది. 3,500 టవర్లను అదనంగా ఏర్పాటు చేసుకుంది.  

‘కేంద్రం ప్రకటించిన సంస్కరణలు టెలికం పరిశ్రమలో మరిన్ని పెట్టుబడులకు దారిచూపనున్నాయి. దీంతో దేశీయంగా డిజిటల్‌ విస్తరణకు ఊతం లభించనుంది. సంస్కరణలు కొనసాగుతాయని, దీర్ఘకాలంగా పరిశ్రమను దెబ్బతీస్తున్న అంశాలకు పరిష్కారాలు లభించవచ్చని భావిస్తున్నాం. 5జీ నెట్‌వర్క్‌ ద్వారా మరింత పటిష్టపడనున్నాం’ అని ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈవో (దక్షిణాసియా)గోపాల్‌ విఠల్‌ పేర్కొన్నారు.

 ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ షేరు యథాతథంగా రూ. 713 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు