విలీనమా.. నో వే! కావాలంటే వారు వెళ్లిపోవచ్చు!

30 Jul, 2022 10:30 IST|Sakshi

సాక్షి, ముంబై: క్యాబ్‌ సేవల సంస్థలు, ఈ బిజినెస్‌లో ప్రధాన ప్రత్యర్థలు ఓలా, ఉబెర్ విలీనవుతున్నాయంటూ పలు రిపోర్టులు బిజినెస్‌ వర్గాల్లో సంచలనం రేపాయి. ఓలా ఉబర్  సంస్థల విలీనం గురించి ఇప‍్పటికే చర్చలు ప్రారంభించాయంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. దేశీయ అతిపెద్ద రైడ్-హెయిలింగ్ కంపెనీ ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ సోషల్‌ మీడియా ద్వారా తీవ్రంగా ఖండించారు. రబ్బిష్‌.. పూర్తిగా పుకార్లే అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

దేశంలో తమ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉందనీ, పురోగతి సాధిస్తున్నామని ఈ క్రమంలో విలీనమనే సమస్య లేదని స్పష్టం చేశారు. అంతేకాదు  కావాలనుకుంటే విదేశీ కంపెనీలు దేశంనుంచి నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! అంతేకానీ తాము  ఎప్పటికీ విలీనం కామంటూ అమెరికా కంపెనీ ఉబెర్‌కు  వ్యంగ్యంగా చురకలేశారు. ఈ మేరకు అగర్వాల్ వార్తా నివేదికలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. బలమైన బ్యాలెన్స్ షీట్‌తో ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన రైడ్ హెయిలింగ్ కంపెనీలలో ఒకటిగా, అందులోనూ భారతదేశంలో మార్కెట్ లీడర్‌గా ఉన్నామని ఓలా ప్రకటించింది. 

కాగా రైడ్ హెయిలింగ్ దిగ్గజాలు ఓలా, ఉబెర్‌ విలీనమార్గంలో ఇప్పటికే చర్చలు ప్రారంభించాయనీ, సీఈఓ అగర్వాల్ అమెరికాలో ఉబెర్ కీలక అధికారులతో భేటీ కానున్నారంటూ పలు వార్తలు వెలువడ్డాయి. రెండు కంపెనీలు ఇంతకు ముందు కూడా విలీన అవకాశాలపై చర్చించాయని, అయితే ఒప్పందం కార్యరూపం దాల్చలేదని నివేదిక పేర్కొంది.  అయితే  ఓలా తన క్విక్ ఫుడ్ డెలివరీ, యూజ్డ్ కార్  బిజినెస్‌ను మూసివేయడం, ఈ వారంలో దాదాపు 300-350 మంది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో ఈ ఊహగానాలు వెలువడటం గమనార్హం.

చదవండి: ట్విటర్‌ డీల్‌ వివాదం: మస్క్‌ మరో కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు