మనోడు గట్టొడే! ఏకంగా ఈలాన్‌ మస్క్‌ మీదే వేశాడు పెద్ద పంచ్‌

28 May, 2022 21:18 IST|Sakshi

వ్యంగంగా కామెంట్లు చేయడంలో భయపడకుండా మాట్లాడటంలో ఎవరైతే నాకేంటి అన్నట్టుగా ప్రవర్తించడంలో మనకు రామ్‌ గోపాల్‌ వర్మ్‌ ఫేమస్‌. కానీ ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే ఈలాన్‌ మస్క్‌ ముందు వరుసలో ఉంటాడు. తన సునిశిత విమర్శలు, ఛలోక్తులతో ఎంతటి వారినైనా ఆటపట్టిస్తుంటాడు. అలాంటి మస్క్‌ మీదే పంచ్‌ వేశాడు మన భవీష్‌ అగర్వాల్‌.


టెస్లా కార్ల తయారీ యూనిట్‌ (గిగా ఫ్యాక్టీ)ని ఈలాన్‌ మస్క్‌ ఇండియాలో నెలకొల్పుతాడా? లేదా అనేది ఇన్నాళ్లు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈలాన్‌ పైకి ట్యాక్సుల పేరు చెబుతున్నా తప్పకుండా ఇండియాకు వస్తాడని చాలా మంది భావిస్తున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ దావోస్‌లో జరిగిన వరల​‍్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో ఓ మీడియా ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రపంచంలో రెండో పెద్ద మార్కెటైన ఇండియాను ఈలాన్‌ మస్క్‌ వదులుకుంటాడని తాను భావించడం లేదన్నారు.

మేం రాబోము
ఇండియాలో ఎలక్ట్రిక్‌ వాహానాలను కేంద్రం భారీ ఎత్తున ప్రోత్సహిస్తోంది, మినహాయింపులు వర్తింప చేస్తోంది. దీంతో చాలా కంపెనీలు ఇండియాలో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌పై ఫోకస్‌ చేశారు. ఇందులో ఓలా కూడా ఒకటి. ఇప్పటికే ఓలా నుంచి వచ్చిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అమ్మకాల్లో దుమ్ము రేపుతుండగా త్వరలో ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ కార్లు కూడా రానున్నాయి. అయితే ఓలా తరహాలోనే ఇండియన్‌ మార్కెట్‌పై ఫోకస్‌ చేసిన కంపెనీలకు టెస్లా ఇక్కడికి వస్తే ఎలాంటి పోటీ నెలకొంటుందనే సందేహాలు ఉన్నాయి. దీంతో ఈలాన్‌ మస్క్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

మస్క్‌ ఏమన్నారు
ఇటీవల ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఈలాన్‌ మస్క్‌ బదులిస్తూ ‘టెస్లా కార్లు అమ్ముకునేందుకు పన్ను రాయితీలు ఇవ్వని దేశంలో కార్ల తయారీ పరిశ్రమను స్థాపించే ఉద్దేశం లేదు’ అని ప్రకటించారు. దీంతో ఈలాన్‌ మస్క్‌ ఇండియాకు రామని, ఇక్కడి మార్కెట్‌పై తమకు ఆసక్తి లేదన్నట్టుగా మాట్లాడారు. ఈలాన్‌ మస్క్‌ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

భవీష్‌ స్పందన
మస్క్‌ తాజా నిర్ణయంపై ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సీఈవో భవీష్‌  అగర్వాల్‌ చిత్రంగా స్పందించారు. థ్యాంక్స్‌, బట్‌ నో థ్యాంక్స్‌ అంటూ ఓలా సీఈవో ట్వీట్‌ చేశారు. ఇండియాకు రాను అని ప్రకటన చేసిందుకు పోటీ కంపెనీగా థ్యాంక్స్‌ చెబుతూనే అదే సమయంలో బట్‌ నో థ్యాంక్స్‌ అని కూడా అన్నారు. మొత్తంగా నువ్వు ఇండియాకు వస్తే ఏంటీ ? రాకుంటే ఏంటీ ? అన్నట్టుగా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. 

మేం రెడీ
సహజంగా చిత్ర విచిత్రంగా కామెంట్లు చేసి ఎదుటి వాళ్లను ఆత్మరక్షణలోకి నెట్టడం ఈలాన్‌ మస్క్‌ స్టైల్‌. అచ్చంగా అతని స్టైల్‌లోనే మస్క్‌కి బదులిచ్చాడు భవీష్‌ అగర్వాల్‌. ఇండియా లాంటి పెద్ద మార్కెట్‌కు రాకుండా ఇక్కడి పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఒంటెద్దు పోకడలకు వెళ్తామంటూ అందుకు తగ్గట్టుగా తమకు వ్యూహాలు ఉంటాయని అర్థం వచ్చేలా చిత్రమైన ట్వీట్‌ చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నా టెస్లాతో పోటీకి తాము సిద్ధమే అన్నట్టుగా సవాల్‌ విసిరారు భవీశ్‌. 

చదవండి: Elon Musk: ప్రపంచ కుబేరుడు.. పరమ పిసినారి..

మరిన్ని వార్తలు