ఎలన్‌ మస్క్‌కు చురకలంటించిన ఓలా సీఈవో...!

27 Jul, 2021 18:07 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా పలు మల్టీనేషనల్‌ వాహన తయారీదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేయడానికి నడుం బిగించాయి. పలు కంపెనీలు భారత మార్కెట్లలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఉన్న ఆదరణను క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో గణనీయమైన పురోగతిని సాధిస్తున్న టెస్లాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాలను భారత్‌లో ప్రవేశపెట్టాలని ఎలన్‌ మస్క్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కొద్ది రోజుల క్రితం భారత్‌లో వేగంగా టెస్లా వాహనాలను ప్రవేశపెట్టాలని ఓ ట్విటర్‌ యూజర్‌ అడిగిన ప్రశ్నకు టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ జవాబిచ్చాడు. భారత్‌లో అత్యధికంగా దిగుమతి సుంకాలు ఉండడంతో ఆటంకంగా మారనుందని నెటిజన్‌కు సమాధానమిచ్చాడు. అంతేకాకుండా దిగుమతికి లైన్‌ క్లియర్‌ అయితే భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశాలు ఉంటాయని సంకేతాలు ఇచ్చాడు. ఎలన్‌ మస్క్‌తో పాటు హ్యూందాయ్‌ ఎండీ ఎస్‌ఎస్‌ కిమ్‌ కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలపై కస్టమ్‌ డ్యూటీస్‌ తక్కువగా ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు. తక్కువ సుంకాలు భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ వృద్ధికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.

తాజాగా టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌, హూందాయ్‌ ఎండీ ఎస్‌ఎస్‌ కిమ్‌లకు ఓలా కో ఫౌండర్‌, సీఈవో భవిష్‌ అగర్వాల్‌ చురకలంటించారు. భారత్‌లోని దిగుమతి సుంకాలను, కస్టమ్‌ డ్యూటీలను తగ్గించాలని వారు చేసిన ప్రతిపాదనను భవీష్‌ అగర్వాల్‌ తప్పుబట్టారు. భారత్‌లోనే ఎలక్ట్రిక్‌ వాహనాలను నిర్మించగల సామర్థ్యంపై ఆయా కంపెనీలు విశ్వాసం కలిగి ఉండాలని సూచించారు. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తుల ఫ్యాక్టరీలను ఏర్పాటుచేయడంతో ప్రపంచంలోని తయారీరంగ దిగ్గజాలను భారత్‌లోకి ఆకర్షించ వచ్చునని తన ట్విట్‌లో భవీష్‌ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు