ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఊహించని అమ్మకాలు, మళ్లీ అదే సీన్‌ రిపీట్‌!

2 Dec, 2022 14:10 IST|Sakshi

ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ నవంబర్‌లో 20 వేల యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. పండుగ సీజన్‌ తర్వాత కూడా తమ విక్రయాలు జోరు ఏ మాత్రం తగ్గలేదని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలు జనాదరణ పొందుతున్న తరుణంలో ఓలా కంపెనీ విడుదల చేసిన ఈవీ బైకలు అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. సేల్స్‌లో మరో సారి 20వేల మార్క్‌ను అందుకున్నట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు సీఈఓ భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. కాగా గత అక్టోబర్‌లోనూ సేల్స్‌ 20 వేలు దాటాయంటూ ఓలా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అందులో.. తమ ద్విచక్ర వాహన బ్రాండ్ మెరుగైన వృద్ధిని సాధించింది. స్కూటర్‌ మార్కెట్ వాటాలో 50 శాతం సొంతం చేసుకున్నాం. నవంబర్‌లో మా అమ్మకాలు మళ్లీ 20,000 యూనిట్లను దాటాయి. భారతదేశంలో అతిపెద్ద ఈవీ కంపెనీగా మార్చిన మా కస్టమర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. జూన్ 2021లో 1,400 EVల నుంచి ప్రస్తుతం 90 శాతం ఈవీ సెగ్మెంట్‌ షేర్ కలిగి ఉంది. 2025 చివరి నాటికి అన్ని 2W విభాగాలలో EVలకు 100 శాతం షేర్‌ ఉండబోతోందని ట్వీట్‌ చేశారు.

నవంబర్‌లో ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి అనే డేటాను ఓలా కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. 20,000 యూనిట్లు అమ్మకాలను మరో సారి అందుకున్నట్లు మాత్రమే ప్రకటించింది. ఓలా ప్రస్తుతం భారత్‌లో S1 ఎయిర్, S1,  S1 ప్రోల పేరుతో విక్రయాలు జరుపుతోంది. దీని ధరలు రూ. 84,999 నుంచి రూ. 1.39 లక్షలుగా ఉంది( ఎక్స్-షోరూమ్). వీటిలో ఎస్‌1 ప్రో ఒక సారి ఫుల్‌ చార్జింగ్‌తో 116kmph అత్యధిక వేగంతో 180km వరకు ప్రయాణించగలదు.
 

చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్‌ కంపెనీ

మరిన్ని వార్తలు