భెల్‌ రికార్డు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో..

17 Sep, 2021 17:49 IST|Sakshi

ఎన్నో భారీ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్న భారత్‌ హెవీ ఎలక్ట్రిక్‌ లిమిటెడ్‌ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుత దేశ అవసరాలకు తగ్గట్టుగా గ్రీన్‌ ఎనర్జీ విభాగంలో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన తొలి పైలట్‌ ప్రాజెక్టును హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించింది. 

తొలి అడుగు హైదరాబాద్‌లో 
కర్బన ఉద్ఘారాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక విధాలైన టెక్నాలజీలు వస్తున్నాయి. అందులో భాగంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్కువ కాలుష్యంతో ఎక్కువ శక్తిని ఇచ్చే ఇంధనాన్ని తయారు చేసే టెక్నాలజీని భెల్‌ అభివృద్ధి చేసింది. అందులో భాగంగా బొగ్గు నుంచి మిథనాల్‌ ఉత్పత్తి చేసే ప్లాంటుని పైలట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో భెల్‌ ప్రారంభించింది.

ఉమ్మడి పరిష్కారం
సాధారణంగా మిథనాల్‌ని నేచురల్‌ గ్యాస్‌ నుంచి తయారు చేస్తారు. అయితే మన దేశంలో సహాయ వాయు నిల్వలు సమృద్ధిగా లేకపోవడంతో ప్రతీసారి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అంతేకాదు అధికంగా విదేశీ మారక ద్రవ్యం దీనిపై ఖర్చు చేస్తోంది. మరోవైపు మన దేశంలో బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నా వాటిలో బూడిద శాతం ఎక్కువగా ఉంటోంది. అందువల​‍్లే కాలుష్యం ఎక్కువ వస్తోందనే నెపంతో కొత్త థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అనేక కోర్రీలు ఎదురవుతున్నాయి. ఈ రెండు సమస్యలకు ఉమ్మడి పరిష్కారంగా భెల్‌ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

బూడిద నుంచి మీథేన్‌
సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న పలు ఏరియాల్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో యాష్‌ (బూడిద) కంటెంట్‌ ఎక్కువగా ఉంటోంది. ఈ బొగ్గుకి డిమాండ్‌ కూడా తక్కువ. ఇలాంటి బొగ్గును ప్రత్యేక పద్దతిలో ప్రాసెస్‌ చేసి మిథనాల్‌గా మార్చే పరిశ్రమను హైదరాబాద్‌లో భెల్‌ ప్రారంభించింది. ప్రతీ రోజు ఈ ప్లాంటు నుంచి రోజుకు 0.25 టన్నుల మిథనాల్‌ ఉత్పత్తి అవుతోంది. దీని ప్యూరిటీ 99 శాతంగా ఉండటం గమనార్హం.

నీతి అయోగ్‌ సహకారంతో
ఇండియాలో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్నా అందులో యాష్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండటం సమస్యగా మారింది. దీంతో ఈ బొగ్గును పూర్తి స్థాయిలో వినియోగించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ బొగ్గును మిథనాల్‌ మార్చే టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిని భెల్‌కి 2016లో నీతి అయోగ్‌ అప్పటించింది.

ఐదేళ్ల శ్రమ
నీతి అయోగ్‌ సూచలనలు అనుసరించి కోల్‌ టూ మిథనాల్‌ ప్రాజెక్టుకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ నుంచి రూ. 10 కోట్లు కేటాయించారు. ఐదేళ్ల శ్రమ అనంతరం తొలి ప్రాజెక్టు హైదరాబాద్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ద్రవరూప మిథనాల్‌ని డీజిల్‌కి ప్రత్యామ్నాయంగా వాడుకునే వీలుంది.

చదవండి : Reliance AGM 2021:ఫ్యూచర్‌ గ్రీన్‌ ఎనర్జీదే... భవిష్యత్‌ భారత్‌దే

మరిన్ని వార్తలు