రెండు గంటల్లో డెలివరీ: బిగ్‌ బజార్‌ 

2 Apr, 2021 11:11 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రిటైల్‌ రంగంలో ఉన్న బిగ్‌ బజార్‌ ఇన్‌స్టాంట్‌ హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన రెండు గంటల్లోనే ఉత్పత్తులను కస్టమర్‌ ఇంటికి చేరుస్తారు. ఫ్యాషన్, ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ, హోం విభాగాల్లో ఉత్పత్తులను సమీపంలోని బిగ్‌ బజార్‌ స్టోర్‌ నుంచి సరఫరా చేస్తారు. మొబైల్‌ యాప్, పోర్టల్‌ ద్వారా వినియోగదార్లు కనీసం రూ.500 విలువ చేసే వస్తువులను ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్‌ విలువ రూ.1,000 దాటితే డెలివరీ చార్జీలు ఉచితం. ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్రమంగా ఇతర నగరాలకూ విస్తరిస్తామని ఫ్యూచర్‌ గ్రూప్‌ ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ ప్రెసిడెంట్‌ కమల్‌దీప్‌ సింగ్‌ తెలిపారు. 45 రోజుల్లో 21 నగరాలకు, ఆరు నెలల్లో అన్ని బిగ్‌ బజార్‌ స్టోర్ల నుంచి ఈ సేవలు ఉంటాయని చెప్పారు. కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ రిటైల్‌ ప్రమోట్‌ చేస్తున్న బిగ్‌ బజార్‌ దేశవ్యాప్తంగా 150 నగరాలు, పట్టణాల్లో 285 ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది. ఫ్యూచర్‌ రిటైల్‌ ఖాతాలో హైపర్‌సిటీ, ఫుడ్‌హాల్, ఎఫ్‌బీబీ, ఫుడ్‌ బజార్, ఈజీడే క్లబ్, హెరిటేజ్‌ ఫ్రెష్‌ సైతం ఉన్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు