Starlink: ఎంట్రీకి ముందే షాకుల మీద షాకులు.. బుక్‌ చేసుకోవద్దంటూ జనాలకు కేంద్రం సూచన

27 Nov, 2021 12:28 IST|Sakshi

TRAI Barred Elon Musk's Starlink Broadband Pre Orders in India: అపరకుబేరుడు ఎలన్‌ మస్క్‌కి భారీ షాకిచ్చింది భారత ప్రభుత్వం. మానసపుత్రిక స్పేఎస్‌ఎక్స్‌ అందించే బ్రాడ్‌బాండ్‌ సర్వీస్‌కు భారత్‌ నుంచి ముందస్తు ఆర్డర్స్‌ తీసుకోకుండా నిషేధించింది. అంతేకాదు  స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌కు ఎవరూ  ప్రీ ఆర్డర్లతో సబ్‌ స్క్రయిబ్‌ కావొద్దంటూ భారతీయులకు సూచించింది కేంద్ర సమాచార శాఖ.


భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలతో ఆకట్టుకోవాలన్న ఎలన్‌ మస్క్‌ ప్రయత్నాలకు విఘాతం కలుగుతోంది. తాజాగా లైసెన్స్‌ లేకుండా స్పేస్‌ఎక్స్‌ స్టార్‌లింక్‌ ప్రీ ఆర్డర్స్‌ తీసుకోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలకు భారత్‌లో ఇంకా లైసెన్స్‌ లభించలేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ 99 డాలర్ల(రూ.7,400)తో బేటా వెర్షన్‌ సేవలను అందించనున్నట్లు, ఆర్డర్లకు దరఖాస్తు పెట్టుకోవాలంటూ భారతీయులను కోరింది. ఈ నేపథ్యంలో ఐదు వేల ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు స్టార్‌లింక్‌ భారత్‌ హెడ్‌ సంజయ్‌ భార్గవ ఈమధ్యే వెల్లడించారు కూడా.

ఈ క్రమంలోనే టెలికమ్యూనికేషన్స్‌ విభాగం(Department of Telecommunications (DoT).. స్టార్‌ లింక్‌ సేవలపై అభ్యంతరాలు లేవనెత్తింది. అంతేకాదు ఇక్కడి రెగ్యులేటర్‌ ఫ్రేమ్‌ వర్క్‌కు అనుగుణంగా పని చేయాల్సిందేనని, డాట్‌ అనుమతులు తప్పనిసరని, లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని స్పేస్‌ఎక్స్‌కు సూచించింది. అంతేకాదు స్టార్‌లింక్‌ను ఎవరూ బుక్‌ చేసుకోవద్దంటూ జనాలకు సూచించింది. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు సంజయ్‌ భార్గవ నిరాకరించారు. ఇదిలా ఉంటే స్టార్‌లింక్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంది స్టార్‌లింక్‌.

ఇక భారత్‌లో స్టార్‌లింక్‌కు మొదటి నుంచే ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో స్పేస్‌ఎక్స్‌ బిడ్‌ను తిరస్కరించాలని కోరుతూ బ్రాడ్‌బాండ్‌ అసోసియేషన్‌లోని వన్‌వెబ్‌(ఇది కూడా స్పేస్‌ ఆధారిత సేవలు అందించేదే!), అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ తదితర కంపెనీలు ట్రాయ్‌, ఇస్రోలకు లేఖలు రాశాయి కూడా.

చదవండి: 'జియో' కంటే తక్కువ ధరకే Starlink శాటిలైట్‌ ఇంటర్నెట్‌..!

మరిన్ని వార్తలు