విమానయాన సంస్థలకు భారీ ఊరట

16 Jul, 2022 13:45 IST|Sakshi

ఏటీఎఫ్‌ ధర 2.2 శాతం తగ్గింపు

సాక్షి,ముంబై: విమానయాన సంస్థలకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి వస్తున్న నేపథ్యంలో జెట్ ఇంధనం (ATF) ధరలు 2.2 శాతం దిగి వచ్చింది.  ఈ మేరకు దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు శనివారం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. ధరలు కిలోలీటర్‌కు రూ. 3,084.94 లేదా 2.2 శాతం తగ్గి, కిలోలీటర్‌కు రూ. 138,147.93గా ఉన్నాయని తెలిపాయి.

ఈ ఏడాదిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి మాత్రమే. గత నెలలో ధరలు కిలో లీటర్‌కు రూ. 141,232.87 (లీటర్‌కు రూ.141.23)కు ఉన్నాయి. స్థానిక పన్నులను బట్టి ధరలు కూడా  రాష్ట్రానికి, రాష్ట్రానికి రేట్లో వ్యత్యాసం ఉంటుంది. బెంచ్‌మార్క్ అంతర్జాతీయ చమురు ధరల రేట్ల ఆధారంగా ప్రతి నెలా 1,  16వ తేదీల్లో సవరించబడతాయి.

జూన్‌ 1 నాటి రివ్యూలో ధరలలో మార్పులేనప్పటికీ జూన్ 16 నాటి పెంపుతో విమాన ఇంధన ధరలు ఆల్‌ టైం హైకి చేరాయి. మొత్తంగా, సంవత్సరం ప్రారంభం నుండి 11 సార్లు రేట్లు సవరించగా, దీంతో ఆరు నెలల్లో ధరలు దాదాపు రెట్టింపయ్యాయి.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం భయాల కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరాయి. ఇదిలా ఉండగా,  ఏటీఎఫ్‌ ధరల సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలతో సమావేశమయ్యేందుకు ఇండియన్ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్‌లు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. స్పైస్‌జెట్, గోఫస్ట్ ఇండిగో, విస్తారా ఇతర విమానయాన సంస్థలు ఐవోసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ ఈ కమిటీలో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు