Jack Ma: అయ్యో! జాక్ మా.. నీకే ఎందుకు ఇలా జరుగుతుంది?

22 Feb, 2022 21:00 IST|Sakshi

Jack Ma-China: జాక్ మా నేతృత్వంలోని యాంట్ గ్రూప్ కో లిమిటెడ్ కంపెనీలో తనిఖీలు చేయాలని ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు, బ్యాంకులను చైనా అధికారులు ఆదేశించినట్లు బ్లూమ్ బెర్గ్ న్యూస్ నివేదించింది. చైనా బ్యాంకింగ్ అండ్ ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్‌తో సహా దాని అనుబంధ సంస్థలు, వాటాదారుల ఆర్ధిక మూలాలకు సంబంధించి వివరాలను నిశితంగా పరిశీలించాలని సంస్థలను కోరినట్లు నివేదిక తెలిపింది. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ యాంట్ గ్రూప్ దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.  నేషనల్ ఆడిట్ కార్యాలయం ఈ తనిఖీలకు నాయకత్వం వహిస్తోంది అని నివేదిక తెలిపింది. 

2020 చివరలో $37 బిలియన్లతో ఐపీఓకు వచ్చిన యాంట్ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఐపీఓ రద్దు అయ్యింది. ఐపీఓ రద్దు చేసినప్పటి నుంచి అలీబాబా బిలియనీర్ వ్యవస్థాపకుడు జాక్ మా నియంత్రణలో ఉంది. చైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించడంతో ఆ కంపెనీ పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ ప్రభావం అలీబాబా షేర్ల మీద పడటంతో ఆ కంపెనీ షేర్లు జనవరి 28 నుంచి 5.3% వరకు పడిపోయాయి. తాజా చర్యలో, నియంత్రణ అధికారులు ఈక్విటీలలో పెట్టుబడుల పెట్టిన వారి వివరాలను సమర్పించాలని, యాంట్ గ్రూప్‌కు సంబంధించి రుణాలను సమర్పించాలని ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు కోరాయి.
 

గత నెలలో, చైనాలోని నాలుగు అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని ఆస్తి నిర్వహణ సంస్థలలో(ఏఎంసీలు) ఒకటైన చైనా సిండా అసెట్ మేనేజ్ మెంట్ కో లిమిటెడ్, ప్రణాళికాబద్ధమైన యాంట్ గ్రూప్ పెట్టుబడిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర అధికారుల ఒత్తిడి కారణంగా యాంట్ గ్రూప్ వినియోగదారు ఫైనాన్స్ విభాగంలో సుమారు $944 మిలియన్ల విలువైన 20% వాటాను కొనుగోలు చేసే ఒప్పందాన్ని సిండా రద్దు చేసింది.  2020 అక్టోబర్‌లో చైనా ఆర్థిక నియంత్రణ మండలి తీరుపై మల్టీబిలియనీర్‌ జాక్‌ మా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నియంత్రణ మండలి తీరుతో తనలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని జాక్‌ మా బహిరంగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతూ వస్తోంది. జాక్‌ మా వ్యాపార లావాదేవీలకు ఆటంకాలు ఎదురవ్వడంతో పాటు యాంట్‌ గ్రూప్‌కు సంబంధించి ఏకంగా 37 బిలియన్‌ డాలర్ల ఐపీవోకు బ్రేకులు పడ్డాయి.

(చదవండి: ఎంత ఖర్చయినా పర్వాలేదు.. ఆరోగ్యం కావాలి!)

మరిన్ని వార్తలు