ఈవీ రంగంలో రూ.2,100 కోట్లు

24 Jun, 2021 20:35 IST|Sakshi

పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ‘ట్రైటాన్‌ ఈవీ’ ఒప్పందం

జహీరాబాద్‌ నిమ్జ్‌లో ఎలక్ట్రిక్‌ వాహన తయారీ ప్లాంట్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎలక్ట్రిక్‌ వాహన(ఈవీ)రంగంలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలకు పోటీనిస్తున్న ‘ట్రైటాన్‌– ఈవీ’ రాష్ట్రంలో భారీ పెట్టుబడిని పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రూ.2,100 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి (నిమ్జ్‌) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటిం చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో ‘ట్రైటాన్‌ ఈవీ’గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ తయారీ యూనిట్‌ ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి జరుగుతుంది. కంపెనీ ప్రణాళిక ప్రకారం తొలి ఐదేళ్లలో 50వేలకు పైగా సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. భారీ పెట్టుబడితో ఏర్పాటయ్యే ట్రైటాన్‌ ఈవీ ద్వారా 25 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తమ తయారీ ప్లాంటును భారత్‌లో ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్రాలను పరిశీలించిన తర్వాత తెలంగాణకు ఉన్న సానుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నుంచే కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సంస్థ సీఈఓ హిమాన్షు పటేల్‌ వెల్లడించారు. కంపెనీ పెట్టుబడికి సంబంధించిన వివరాలను ఆయన కేటీఆర్‌కు అందించారు.

 పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానం: మంత్రి కేటీఆర్‌
ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీ) రంగంలో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌ ఐపాస్‌లో భాగంగా ట్రైటాన్‌ ఈవీకి ప్రభుత్వపరంగా మెగా ప్రాజెక్టుకు లభించే ప్రయోజనాలన్నీ అందిస్తామని సంస్థ ప్రతినిధులకు కేటీఆర్‌ హామీనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈవీ పాలసీ దేశంలోనే అత్యుత్తమైనదిగా ప్రశంసలు అందుకుంటోందని, ఈ రంగంలో పేరొందిన పలు కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని కేటీఆర్‌ చెప్పారు. కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, ట్రైటాన్‌ ఈవీ ఇండియా డెవలప్‌మెంట్‌ హెడ్‌ మహమ్మద్‌ మన్సూర్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి : ఎలక్ట్రిక్ వాహన విప్లవం రాబోతుంది: భవిష్ అగర్వాల్

మరిన్ని వార్తలు