ఆఫ్‌లైన్‌ రిటైల్‌లోకి బిగ్‌బాస్కెట్‌

25 Nov, 2021 06:26 IST|Sakshi

బెంగళూరులో ఫ్రెషో స్టోర్‌

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో నిత్యావసర సరుకులు విక్రయించే బిగ్‌బాస్కెట్‌ తాజాగా ఆఫ్‌లైన్‌ రిటైల్‌ విభాగంలోకి ప్రవేశించింది. కొత్తగా టెక్నాలజీ ఆధారిత, సెల్ఫ్‌ సర్వీస్‌ ’ఫ్రెషో’ స్టోర్‌ను బెంగళూరులో ప్రారంభించింది. 2023 నాటికి దేశవ్యాప్తంగా 200 భౌతిక స్టోర్లు, 2026 నాటికి 800 స్టోర్లు ఏర్పాటు చేయాలన్న ప్రణాళికల్లో భాగంగా దీన్ని ఆవిష్కరించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హరి మీనన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను పోటీ సంస్థలతో పోలిస్తే మరింత చౌకగా వీటి ద్వారా అందించాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు.

ఈ స్టోర్స్‌లో తాజా పండ్లు, కూరగాయలతో పాటు బ్రెడ్, గుడ్లు మొదలైన నిత్యావసరాలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బిగ్‌బాస్కెట్‌లో 50,000 ఉత్పత్తుల శ్రేణి నుంచి కొనుగోలుదారులు తమకు కావాల్సినవి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి, తమ వీలును బట్టి ఫ్రెషో స్టోర్స్‌ నుంచి వాటిని తీసుకోవచ్చని మీనన్‌ చెప్పారు. కస్టమర్లు తమకు కావాల్సిన ఉత్పత్తులను తీసుకుని, ఆటోమేటిక్‌ కంప్యూటర్‌ విజన్‌ ఉండే కౌంటర్‌లో తూకం వేయొచ్చని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో సెల్ఫ్‌ బిల్లింగ్‌ కౌంటర్లు ఆటోమేటిక్‌గా బిల్లును రూపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు