Bigg Boss: బాస్‌లకే బాస్‌ అసలైన బిగ్‌బాస్‌ ఇతనే

6 Sep, 2021 10:46 IST|Sakshi

Bigg Boss Show Creator: ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది ఇది ఓ మొబైల్‌ కంపెనీకి సంబంధించిన ఫేమస్‌ కొటేషన్‌. అయితే హలాండ్‌కి చెందిన ఓ వ్యక్తికి వచ్చిన ఐడియా ఆయన జీవితాన్నే కాదు ఎంటైర్‌టైన్‌మెంట్‌ వరల్డ్‌ రూల్స్‌నే మార్చేసింది. బుల్లితెరపై సంచలన విప్లవానికి దారి తీసింది. కొత్త తరహా ఐడియాకి బిజినెస్‌ రూపం ఇచ్చిన అమలు పరిచిన వ్యక్తి వందల కోట్లకు అధిపతి అయితే ఆ ఐడియా ఆధారంగా రూపొందిన గేమ్‌షోను వందల కోట్ల మంది కళ్లప్పగించి చూస్తున్నారు. అంతమందిని తన ఐడియా చుట్టూ తిప్పుకున్న ఆ బిగ్‌బాస్‌, ఆ బిగ్‌బ్రదర్‌ పేరు జాన్‌ డే మోల్‌. ఫ్లాష్‌లా తట్టిన ఒక ఐడియాను ఓ సక్సెస్‌ఫుల్‌ షోలా ఎలా మార్చగలిగాడు? అతని విజయానికి కారణాలేంటీ ?

అసలైన వ్యాపార సూత్రం
కొత్తదనం అనేది వ్యాపార విజయ సూత్రాల్లో ప్రధానమైంది. అప్పటి వరకు నడుస్తున్న ట్రెండ్‌కి భిన్నంగా వెళ్లగలిగే వాళ్లు అతి తక్కువ కాలంలో అత్యంత భారీ విజయాలు సాధిస్తారనడానికి మరో ఉదాహరణ జాన్‌ డే మోల్‌. అప్పటి వరకు నాటకాలు మొదలు సినిమా, టీవీ సీరియళ్ల వరకు వినోదరంగం అంతా స్క్రిప్ట్‌ బేస్డ్‌గానే ఉండేది. ముందుగానే ఏ సన్నివేశం ఎలా ఉండాలో, నటీనటులు ఎలా నటించాలో, కెమెరా యాంగిల్‌ ఎలా ఉండాలో ముందుగానే నిర్ణయం జరిగేది. కానీ ఇందుకు విరుద్ధంగా అసలు స్క్రిప్ట్‌ అనేదే లేకుండా వినోద కార్యక్రమాన్ని రియలిస్టిక్‌గా చూపితే ఎలా ఉంటుందనే కొత్త రకం ఐడియాకు పురుడు పోసి భారీ విజయం అందుకున్నాడు జూన్‌ డే మూల్‌. ఐడియాలో నవ్యత, తాజాదనం, యూనివర్సల్‌ అప్పీల్‌ ఉంది కాబట్టే నెదర్లాండ్‌ వంటి చిన్న దేశంలో ప్రారంభమైన బిగ్‌బ్రదర్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌గా మారి ప్రపంచ దేశాలను చుట్టేసింది.

పరిశీలన దృష్టి
బిజినెస్‌లో రాణించాలంటే సునిశిత పరిశీలనా దృష్టి ఎంతో అవసరం. అది మెండుగా ఉన్న వారిలో జాన్‌ డే మూల్‌ ఒకరు. తన ఆఫీసులో పని చేసే ఓ ఉద్యోగి, ఓ రోజు మాటల సందర్భంగా తాను చదివిని అమెరికన్‌ సైన్స్‌ జర్నల్‌లోని అంశాలను జాన్‌తో చర్చించాడు. ఈ సందర్భంలో బయో స్పియర్‌ పేరుతో అమెరికా ఓ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ చేపట్టాలనుకుందని,  అందులో భాగంగా ఒక పెద్ద గాజు భవంతిని నిర్మించి అందులో కొందరు మనుషులను ఉంచాలనుకుందని చెప్పాడు. ఆ గాజు గ్లాసు లోపలే ఉంటూ మనుగడ సాగించేందుకు అందులోని మనుషులు ఎలా పంటలు పండిస్తారు, ఎలా నీటిని నిల్వ చేసుకుంటారు... ఇలా మానవ మనుగడ ఏ తీరుగ ఎవాల్వ్‌ అయ్యిందనే అంశాలను ప్రత్యక్షంగా చూడాలని అనుకుందంటూ జాన్‌తో చెప్పుకుంటూ పోయాడు. అందులో మనుషుల మనుగడను ప్రత్యక్షంగా చూడటం అనే అంశం జాన్‌ దృష్టిని ఆకర్షించింది.

ఐడియాల మేళవింపు
ఐడియా అనేది చాలా చిన్నది. కానీ దానిని విస్తరించి కార్యరూపం ఇవ్వడం కష్టమైన పని. అది చేయాలంటే ఎంతో పట్టుదల, దానికి కావాల్సిన వనరులను సమకూర్చుకోవడానికి ఎంతో కృషి కావాలి. సైన్స్‌ జర్నల్‌లో వచ్చిన బయో స్పియర్‌ కాన్సెప్టుకి కార్యరూపం ఇచ్చేందుకు తన మెదడుని మథించాడు జాన్‌. అప్పుడే అతని బుర్రలో ఫ్లాష్‌లా మెరిసింది జార్జ్‌ ఓర్వెల్‌ రాసిన 1984 అనే నవల. రెండు ప్రపంచ యుద్దాల తర్వాత భవిష్యత్తు ఎలా ఉండవచ్చనే ఊహతో 1949లో ఆ నవల రాయబడింది. అందులో భవిష్యత్తులో ప్రజలను కంట్రోల్‌ చేసేందుకు ప్రభుత్వాలు దేశమంతంటా ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు అమర్చుతాయి. వ్యక్తిగత జీవితాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తుంటాయి. దీంతో ప్రజలు పడిన ఇబ్బందులు అందులో నుంచి పుట్టుకొచ్చే హాస్యం ఇతర భావోద్వేగాల ఆధారంగా ఆ నవల సాగుతుంది. ఒక సైన్స్‌ జర్నల్‌లో నచ్చిన ఐడియాకి మరో ఫిక‌్షన్‌ నవల కాన్సెప్టుని జోడిస్తే అద్భుతంగా ఉంటుందని నమ్మాడు జాన్‌ డీ మోల్‌. 

పట్టుదల
ఫ్రేమ్‌లో కొద్ది మంది యాక్టర్లు ముందుగా ఇచ్చిన స్క్రిప్ట్‌ని బట్టి నటిస్తుంటే ఓ నాలుగు కెమెరాల్లో షూట్‌ చేసి సినిమా, సీరియల్స్‌గా అందిస్తే ఆడియన్స్‌కి నచ్చుతోంది. మరి పది మంది నటులు ఎటువంటి స్క్రిప్ట్‌ లేకుండా 120 కెమెరాలతో షూట్‌ చేస్తే... ఆ ఫుటేజీ చూడటానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తారనే ఐడియాతో అనే పేరుతో షూటింగ్‌ ప్రారంభించారు. చూసిన వాళ్లెవరు ఈ ప్రొగ్రామ్ క్లిక్‌ అవుతుందని నమ్మలేదు. అంతా నిరాశ పరిచిన వారే. ఈ ప్రోగ్రామ్‌ స్పాన్సర్‌ చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అయినా తన ఐడియాపై నమ్మకంతో పట్టుదలగా ముందుకు వెళ్లాడు. మొదటి సీజన్‌ షూట్‌ పూర్తియినా అడ్వర్‌టైజ్‌మెంట్లు రాలేదు. గుండె ధైర్యంతో ప్రోగ్రామ్‌ను ప్రసారం మొదలుపెట్టారు. నాలుగు వారాలు గడిచాక మెల్లగా జనాలు ఎక్కడం మొదలైంది. అంతే ఇక వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. మన తెలుగులో ప్రస్తుతం ఐదో సీజన్‌ ప్రారంభం అయ్యింది. 

పాజిటివ్‌ థింకింగ్‌
బిగ్‌బాస్‌ మాతృక బిగ్‌బ్రదర్‌ కార్యక్రమానికి మొదట అనుకున్న పేరు గోల్డెన్‌ కేజ్‌. కానీ పంజరం, బోను అనే పదాలు అందులో బంధిగా ఉండగా ఉండటం అనేది నెగటీవ్‌గా ఉన్నట్టు జాన్‌ డీ మోల్‌కి చెప్పారు. తన ఐడియాపై గట్టి నమ్మకం ఉన్నప్పుడు ఎంతమంది వారించినా ధైర్యంగా ముందుకు వెళ్లాడో.. అదే తీరులో తనకు నచ్చిన పేరైనా సరే లాజికల్‌గా బాగాలేదనే సలహాని అదే స్ఫూర్తితో జాన్‌ స్వీకరించాడు దీంతో 1984 నవలలో ఉన్న సోషల్‌ సర్వైలెన్స్‌ పేరైన బిగ్‌బ్రదర్‌నే ఈ కార్యక్రమానికి ఎంచుకున్నారు. ఆ బిగ్‌బ్రదరే మనల్ని ఇప్పుడు బిగ్‌బాస్‌గా అలరిస్తున్నాడు. 

రెండు బిలియన్‌ డాలర్లు
ఫోర్బ్స్‌ పత్రిక అత్యంత ధనవంతుల లిస్టును ప్రతీ ఏడు ప్రచురిస్తుంది. అందులో ఎక్కువ పేర్లు బిజినెస్‌ కేటగిరీకి చెందిన వ్యక్తులకే స్థానం దక్కుతుంది. ఆ తర్వాత స్పోర్ట్స్‌ , సినీ సెలబ్రిటీలు ఉంటారు. కానీ ఒక టీవీ నిర్మాతగా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సాధించాడు. వ్యక్తిగత ఆస్తుల విలువే రెండు బిలియన్‌ డాలర్లుగా నమోదు అయ్యింది. 

ప్రపంచమంతటా 
బిగ్‌బ్రదర్‌తో పాటు యూటోఫియా, ది వాయిస్‌, ఫియర్‌ ఫ్యాక్టర్‌, డీల్‌ ఆర్‌ నో డీల్‌ వంటి అనేక రియాల్టీ షోలను అందించారు. పెద్ద సంస్థలతో సంబంధం లేకుండా ప్రపంచంలోనే వ్యక్తిగతంగా అత్యధికంగా ప్రోగ్రామ్స్‌ను సృష్టించిన నిర్మాతగా ఆయన రికార్డు సృష్టించారు. ఒక క్రియరేటర్‌గా పక్కా బిజినెస్‌మెన్‌గా ఆయన ప్రొడక‌్షన్‌ హౌజ్‌ నుంచి వచ్చిన అనేక రియాల్టీ షోలు వివిధ పేర్లతో వివిధ రూపాల్లో 76 దేశాల్లో 295 ఛానల్స్‌లో 800లకు పైగా రియాల్టీషోలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. 

-  సాక్షి, వెబ్‌డెస్క్‌ 

చదవండిDeccan Aviations: రూపాయికే విమానం ఎక్కించిన గోపినాథ్‌ ఏమంటున్నారు

మరిన్ని వార్తలు