తెలంగాణకు మరో భారీ ప్రాజెక్టు..ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంట్‌..!

20 Apr, 2022 07:56 IST|Sakshi

తెలంగాణలో రూ.1,144 కోట్లతో ఏర్పాటు  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉన్న యూఎస్‌ సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్‌ తెలంగాణలో భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. 200 ఎకరాల్లో ఈ కేంద్రం రానుంది. తొలి దశ వచ్చే ఏడాది, రెండవ దశ 2024 నాటికి పూర్తి కానుంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.4 లక్షల యూనిట్లు.

ఇది కార్యరూపంలోకి వస్తే ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహన తయారీలో ప్రపంచంలో అతి పెద్ద ప్లాంటు కానుంది. ఈ కేంద్రం కోసం సంస్థ సుమారు రూ.1,144 కోట్లు ఖర్చు పెడుతోంది. 3,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని కంపెనీ మంగళవారం ప్రకటించింది. టాస్క్‌మన్‌ కార్గో, అర్బన్‌ ప్యాసింజర్‌ వాహనాలను ప్లాంటులో తయారు చేస్తారు. బిలిటీ వాహనాల తయారీ భాగస్వామిగా హైదరాబాద్‌కు చెందిన గయమ్‌ మోటార్‌ వర్క్స్‌ వ్యవహరిస్తోంది.

యూఎస్, జపాన్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ తదితర 15 దేశాల్లో 1.2 కోట్ల టాస్క్‌మన్‌ కార్గో వాహనాలు పరుగెడుతున్నాయని బిలిటీ ఎలక్ట్రిక్‌ సీఈవో రాహుల్‌ గయమ్‌ తెలిపారు. అమెజాన్, ఐకియా, బిగ్‌బాస్కెట్, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్‌ వంటి సంస్థలు ఉత్పత్తుల డెలివరీకి ఈ వాహనాలను వినియోగిస్తున్నాయి. 

చదవండి: ఓలా స్కూటర్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన భవీశ్‌ అగర్వాల్‌

మరిన్ని వార్తలు