భారత డిజిటల్‌ నెట్‌వర్క్‌ భేష్‌

2 Mar, 2023 04:21 IST|Sakshi

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ప్రశంసలు

న్యూఢిల్లీ: భారత్‌లోని డిజిటల్‌ పబ్లిక్‌ నెట్‌వర్క్‌ భేషుగ్గా ఉందని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ప్రశంసించారు. దేశీయంగా విశ్వసనీయమైన, చౌకైన కనెక్టివిటీ లభిస్తుందని చెప్పారు. భారత్‌ అత్యంత చౌకైన 5జీ మార్కెట్‌ కావచ్చని ఆయన పేర్కొన్నారు.  బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన జీ20 సంబంధ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గేట్స్‌ ఈ విషయాలు తెలిపారు.

ఆధార్, చెల్లింపుల వ్యవస్థ, మరింత మందిని బ్యాంకింగ్‌ పరిధిలోకి తెచ్చేందుకు భారత్‌ సాధించిన పురోగతి తదితర అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రాథమిక ఆధార్‌ రూపకల్పనపై ఇన్వెస్ట్‌ చేయడం సహా చెల్లింపుల విధానాన్ని సులభతరం చేయడంలో భారత్‌ సమగ్రమైన ప్లాట్‌ఫాంను రూపొందించిందని గేట్స్‌ చెప్పారు. ఈ విషయంలో మిగతా దేశాలకు ఆదర్శంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వర్ధమాన దేశాలు ఇలాంటి వాటి అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.

మరిన్ని వార్తలు