Billionaire Barber Story: ఒకపుడు తినడానికి లేదు..ఇపుడు 600 లగ్జరీ కార్లు..‘బిలియనీర్‌ బాబు’ స్టోరీ చూస్తే..!

11 Apr, 2023 17:50 IST|Sakshi

అపుడన్నీ కష్టాలే..ఇపుడు సెలబ్రిటీలు క్యూ

బిగ్‌బీ, ఐశ్వర్య, సల్మాన్‌ లాంటి సెలబ్రిటీ కస్టమర్లు

బెంగళూరు రమేష్‌ బాబు  లేదా ‘ఇండియన్‌ ' బిలియనీర్‌ బార్బర్‌’. 600 కార్ల  కలెక్షన్‌ను గమనిస్తే  ఎవరైనా  ఔరా అనక తప్పదు.  అందులోనూ అన్నీ ఖరీదైన కార్లే. ఎక్కువ భాగం బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్‌ రోవర్‌ రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ బ్రాండ్సే.బిలియనీర్ బాబుగా పాపులర్‌ అయిన రమేష్‌ బాబు ఒకప్పుడు కడు పేదవాడే. ఒక పూట తింటే రెండోపూటకు కష్టమే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కూలిపనులకెళ్లాడు. జీవితం గడవడానికి అమ్మకు తోడుగా  చాలా ఉద్యోగాలు చేశాడు.  మరి బిలియనీర్‌గా ఎలా అవతరించాడు..?

రమేష్ బాబు తండ్రి గోపాల్ బెంగళూరులో క్షురకుడుగా పని చేసేవారు. రమేష్‌ ఏడేళ్ల వయస్సులోనే తండ్రి  కన్నుమూశారు.  దీంతో తల్లి  ముగ్గురు పిల్లలున్న కుటుంబానికి బెంగళూరులోని బ్రిడ్జ్ రోడ్‌లోని చిన్న బార్బర్‌ షాప్  ఒక్కటే జీవనాధారం. కేవలం 40-50 రూపాయలతో పిల్లల్ని పోషించేది. పిల్లల్ని చదివించింది. బట్టలు, పుస్తకాలు, ఫీజులు, అన్నింటికీ వినియోగించేది. మరోవైపు బార్బర్‌షాప్‌ను నిర్వహించలేక రోజుకు రూ.5 అద్దెకు ఇచ్చేయడంతో పరిస్థితి మరింత దుర్భరమైంది. ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకునే వారు. 13 సంవత్సరాల వయస్సులో న్యూస్ పేపర్ డెలివరీ,మిల్క్ హోమ్ డెలివరీలాంటి ఎన్నో పనులు చేసిన కుటుంబ పోషణలో తల్లి ఆసరాగా ఉండేవాడు.

 రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌
10వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి, చివరికి తండ్రి పాత దుకాణం 'ఇన్నర్ స్పేస్' లో బార్బర్‌గా పని చేయడం ప్రారంభించాడు.  పట్టుదలతో కష్టించి పనిచేశాడు. అది త్వరలోనే ట్రెండీ స్టైలింగ్ అవుట్‌లెట్‌గా మారిపోయింది.  హెయిర్‌స్టయిలిస్ట్‌గా బాగా పేరు గడించాడు. ఆ తర్వాత రమేష్ బాబు 1993లో తన మామ దగ్గర కొంత డబ్బు తీసుకుని మారుతీ ఓమ్నీ వ్యాన్ కొనుగోలు చేశాడు. ఈ కారు ఈఎంఐ చెల్లించేలేక ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాడు. అలా  తన తల్లి పనిచేసే కుటుంబానికి చెందిన ఇంటెల్ కంపెనీ ఉద్యోగులను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొచ్చే పని తీసుకుని ట్రావెల్స్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు.  అది లాభసాటిగా ఉండటంతోపాటు, పర్యాటక రంగానికి ప్రభుత్వంప్రోత్సాహంతో  2004లో  రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ని  లాంచ్‌ చేసి లగ్జరీ కార్ రెంటల్  అండ్‌  సెల్ఫ్ డ్రైవ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ముప్పై ఏళ్లుగా సేవలందిస్తూ, ఖరీదైన కార్లను సేకరిస్తూనే ఉ‍న్నాడు. అలా 600కు పైగా కార్లు అతని గారేజ్‌లో ఉన్నాయి.దాదాపు అన్నీ బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్‌ రోవర్‌, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లంటేనే అతని వ్యాపారాన్ని అర్థం చేసుకోవచ్చు. వీటితోపాటు వ్యాన్‌లు, మినీబస్సులు కూడా ఉన్నాయి.

తొలి లగ్జరీ కారు
మెర్సిడెస్‌ ఈ కాస్ల్‌ సెడాన్‌ అతని తొలి లగ్జరీ కారు.  దీని ధర రూ.38 లక్షలు. ప్రస్తుతం  3 కోట్ల ఆర్‌ఆర్‌ ఘోస్ట్‌, 2.6 కోట్ల ఖరీదైన  మేబ్యాచ్‌  అతని ట్రావెల్స్‌లో ఉన్నాయి.   రమేష్ బాబు కంపెనీ ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో నడుస్తుంది. అదే సమయంలో, అతని వ్యాపారం కొన్ని ఇతర దేశాలలో కూడా విస్తరించింది. దాదాపు 300 పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు. 

బిగ్‌బీ, ఆమీర్‌ ఖాన్‌ లాంటి  సెలబ్రిటీ కస్టమర్లు
రమేష్‌ అన్ని కార్లను డ్రైవ్‌ చేయగలడు. అతని క్లయింట్ల జాబితా అంతా సెలబ్రిటీలు, బిలియనీర్లే. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ లాంటి వారితోపాటు, ప్రముఖ రాజకీయ నాయకులు ధనిక పారిశ్రామికవేత్తలు కూడా వారు పట్టణంలో ఉన్నప్పుడు కార్లను అద్దెకు తీసుకుంటారట. రోజుకు వసూలు చేసే అద్ద 50వేల రూపాయలకు పై మాటే. అన్నట్టు ఇప్పటికీ తన వృత్తిని వదులుకోకపోవడం విశేషం. బిలియనీర్‌ బాబు మెర్సిడెస్ లేదా రోల్స్ రాయిస్‌లోని తన దుకాణానికి వెళ్తాడు. నిజంగా రమేష్ బాబు కథ స్ఫూర్తిదాయకం. 2 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే  రిచెస్ట్‌ బార్బర్‌గా ఫోర్బ్స్‌ గుర్తించింది. 

మరిన్ని వార్తలు