ఇన్సూరెన్స్ రంగంలో ‘బీమా సుగ‌మ్’ గేమ్ చేంజ‌ర్‌

31 Oct, 2022 09:31 IST|Sakshi

న్యూఢిల్లీ: బీమా సుగమ్‌ అన్నది బీమా రంగం స్వరూపాన్నే మార్చేస్తుందని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) చైర్మన్‌ దేవాశిష్‌ పాండా అన్నారు. బీమా పాలసీల విక్రయం, కొనుగోలు, రెన్యువల్‌ (పునరుద్ధరణ), క్లెయిమ్‌ల పరిష్కారం సహా అన్ని రకాల సేవలను అందించే ఏకీకృత ప్లాట్‌ఫామ్‌గా ఉంటుందన్నారు. దేశంలో బీమా వ్యాప్తి విస్తరణకు ఈ టెక్నాలజీ పోర్టల్‌ సాయంగా నిలుస్తుందన్నారు. కస్టమర్లకు సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందన్నారు. 

యూపీఐ విప్లవం వంటిది...
బీమా రంగానికి బీమా సుగమ్‌ అన్నది యూపీఐ విప్లవం వంటిదని వ్యాఖ్యానించారు. బీమా కంపెనీలు ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం కావాలని పిలుపునిచ్చారు. బీమా ఏజెంట్లు, వెబ్‌ అగ్రిగేటర్లు సహా అన్ని రకాల మధ్యవర్తులకూ ఈ పోర్టల్‌ యాక్సెస్‌ ఉంటుందని చెప్పారు. పాలసీదారులు ఈ పోర్టల్‌ నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. బీమాకు సంబంధించి దీన్నొక షాపింగ్‌ మాల్‌గా పాండా అభివర్ణించారు.    

మరిన్ని వార్తలు